Sri Sathya Sai: బక్రీద్‌కు పటిష్ట బందోబస్తు.. ఎస్పీ కీలక ఆదేశాలు!
Sri Sathya Sai: బక్రీద్ పండుగ నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు.
Sri Sathya Sai: బక్రీద్‌కు పటిష్ట బందోబస్తు.. ఎస్పీ కీలక ఆదేశాలు!
శ్రీ సత్యసాయి: బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
జిల్లాలోని ప్రధాన మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని, సున్నిత ప్రాంతాల్లో నిఘాను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ గారు ఆదేశించారు. బీట్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు మొబైల్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి ప్రజల్లో భద్రతాభావం కల్పించాలని పేర్కొన్నారు.
అపోహలు, ఉద్రిక్తతలకు తావివ్వకుండా స్థానిక స్థాయిలో సమన్వయం కొనసాగించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర వేదికల్లో అభ్యంతరకర పోస్టులు, విద్వేషపూరిత సందేశాలు పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు 24 గంటలు సోషల్ మీడియా గ్రూపులను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు.
పండుగ సందర్భంగా రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాహన రాకపోకలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. జంతు వధశాలల వద్ద పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
త్యాగం, సహనం, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినాన్ని జిల్లా ప్రజలు శాంతి సామరస్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.




