Puttaparthi: ఊరెళ్తున్నారా? అయితే 'LHMS' యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి ఎస్పీ

Puttaparthi: పోలీసులు కేవలం 45 రోజుల్లోనే రూ. 29 లక్షల విలువైన 141 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బాధితులకు అందజేశారు

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 6 July 2026 9:23 PM IST
Puttaparthi
X

Puttaparthi: ఊరెళ్తున్నారా? అయితే 'LHMS' యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి ఎస్పీ

పుట్టపర్తి: ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ అత్యంత ముఖ్యమైన సాధనంగా మారిందని, అందువల్ల దానిని ఎల్లప్పుడూ జాగ్రత్తగా భద్రపరచుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న చోరీ కేసులకు సంబంధించి CEIR పోర్టల్, IMEI నంబర్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేసినట్లు తెలిపారు. గత ఐదు నెలల్లో మొత్తం 270 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు తెలిపారు.

మొబైల్ ఫోన్‌ను ఎల్లప్పుడూ భద్రంగా ఉంచుకోవాలని, బస్టాండ్లు, మార్కెట్లు, షాపింగ్ ప్రాంతాలు, బస్సు ప్రయాణాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని సూచించారు. మొబైల్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు. బిల్లు లేదా సరైన పత్రాలు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయరాదని హెచ్చరించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, కుటుంబ ఫోటోలు వంటి విలువైన డేటా రక్షణ కోసం వెంటనే ఫోన్‌ను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు.

ఇంటి దొంగతనాల నివారణకు LHMS...

ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. పండుగలు లేదా ఇతర అవసరాల కోసం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే వారు Lock House Monitoring System (LHMS) యాప్‌లో ముందస్తుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. కనీసం ఒక రోజు ముందుగానే యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందితే, పోలీసు సిబ్బంది ఇంటి వద్ద సెన్సార్ కెమెరాలను ఏర్పాటు చేస్తారని వివరించారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో కెమెరా ముందు ఏదైనా కదలిక జరిగిన వెంటనే కంట్రోల్ రూమ్‌కు అలారం చేరుతుందని, ఆ సమాచారం అందిన వెంటనే సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు బృందాలు అప్రమత్తమై మూడు నుంచి నాలుగు నిమిషాల్లో ఘటనాస్థలానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ఇంటి దొంగతనాలను సమర్థవంతంగా నివారించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సేవ కోసం ప్రజలు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదని, యాప్ ద్వారా సమాచారం ఇవ్వడమే సరిపోతుందని స్పష్టం చేశారు.

బాధితుల ఆనందం...

తమకు ఎంతో విలువైన మొబైల్ ఫోన్లు తిరిగి అందడంతో 141 మంది బాధితులు జిల్లా ఎస్పీ గారికి, సైబర్ క్రైమ్ విభాగానికి, క్యాట్ టీం పోలీస్ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసు అధికారులను అభినందించిన జిల్లా ఎస్పీ గారు..

మొబైల్ ఫోన్ల రికవరీలో విశేష కృషి చేసిన ఐటీ కోర్–సైబర్ క్రైమ్ క్యాట్ టీం విభాగం, సీఐలు గోపీనాథ్ రెడ్డి, సతీష్ కుమార్, పోలీస్ సిబ్బంది చంద్ర, శ్రీనివాసులు, షమీర్, సీసీఎస్ సిబ్బంది కృష్ణానాయక్, నరసింహమూర్తి తదితరులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అంకిత సురాన, సైబర్ క్రైమ్ సీఐ గోపీనాథ్ రెడ్డి, క్యాట్ టీం, సోషల్ మీడియా సిబ్బంది, మొబైల్ ఫోన్లు పొందిన బాధితులు పాల్గొన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story