Kothacheruvu: సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి: కలెక్టర్ శ్యాం ప్రసాద్
Kothacheruvu: కొత్తచెరువులో ఏపీఎస్‌ఎస్‌డీసీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’ను కలెక్టర్ శ్యాం ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు.
Kothacheruvu: సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవాలి: కలెక్టర్ శ్యాం ప్రసాద్
శ్రీ సత్యసాయి జిల్లా, కొత్తచెరువు: మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. కొత్తచెరువు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC), ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన “ఇన్ఫోసిస్ స్ప్రింగ్‌బోర్డ్ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్” మొబైల్ ల్యాబ్‌ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆధునిక STEM విద్యను అందించడంలో మొబైల్ ల్యాబ్ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు హైటెక్ పరిజ్ఞానాన్ని నేరుగా అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు.
మొబైల్ ల్యాబ్‌లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు, సెన్సార్లు, LEDలు, మోటార్లు, స్విచ్‌లు, ప్రాథమిక సర్క్యూట్ డిజైనింగ్‌పై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. రోబోటిక్స్, సెన్సార్ల అనుసంధానం, మోటార్ కంట్రోల్, ఆటోమేటిక్ మెకానిజమ్స్‌తో పాటు ప్రోగ్రామింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)పై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.
అలాగే 3D మోడలింగ్, 3D ప్రింటింగ్ ద్వారా డిజిటల్ డిజైన్లను భౌతిక నమూనాలుగా రూపొందించే విధానంపై విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సైద్ధాంతిక విద్యకు, పరిశ్రమలకు అవసరమైన ఆచరణాత్మక నైపుణ్యాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు ల్యాబ్ ఆన్ వీల్స్ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలలు, కళాశాలలను ఈ మొబైల్ ల్యాబ్ క్రమబద్ధంగా సందర్శిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కళ్యాణి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరికృష్ణ, సీడాప్ జేడీఎం సూర్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి చెన్నకేశవ, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




