Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీసుల హైటెక్ నిఘా.. డ్రోన్ కెమెరాలతో జల్లెడ!
Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతిభద్రతల కోసం డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. పుట్టపర్తి, కొత్తచెరువు ప్రాంతాల్లో సీఐ బొజ్జప్ప ఆధ్వర్యంలో జరిగిన డ్రోన్ తనిఖీల వివరాలు.
పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లాలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడానికి పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా చేపట్టారు.
జిల్లాలోని ముఖ్య ప్రాంతాలు, జనసమ్మర్థం ఉన్న ప్రదేశాలు, ఉత్సవాల ప్రాంతాలు, సున్నిత ప్రాంతాలపై డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ నిర్వహిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఎయిర్పోర్ట్ సి.ఐ బొజ్జప్ప తన సిబ్బందితో కలిసి పుట్టపర్తి అర్బన్ పరిధి, కర్ణాటక నాగేపల్లి, సత్తెమ్మ సర్కిల్, కలెక్టరేట్ ప్రాంతం, పుట్టపర్తి టౌన్, బుక్కపట్నం, కొత్తచెరువు నెహ్రూ సర్కిల్, కొత్తచెరువు రూరల్ ప్రాంతాల్లో డ్రోన్ నిఘా నిర్వహించారు.
ఈ చర్యల ద్వారా నేరాలను ముందుగానే గుర్తించి అడ్డుకోవడం, ట్రాఫిక్ నియంత్రణ మెరుగుపరచడం, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించడం లక్ష్యమని అధికారులు తెలిపారు. డ్రోన్ పర్యవేక్షణ ద్వారా అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని సి.ఐ బొజ్జప్ప విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్పీ తెలిపారు.




