Kadiri: గ్రామ పంచాయతీల్లో కూటమి విజయమే లక్ష్యం: కదిరి ఎమ్మెల్యే!
Kadiri: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాబోయే పంచాయతీల్లోనూ కూటమి విజయమే లక్ష్యమని కదిరి ఎమ్మెల్యే అన్నారు.
Kadiri: గ్రామ పంచాయతీల్లో కూటమి విజయమే లక్ష్యం: కదిరి ఎమ్మెల్యే!
కదిరి: సత్యసాయి జిల్లా కదిరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయాలను చూసి వైసీపీ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, ఓటమికి సాకులు వెతుక్కోవడం వైసీపీ నాయకుల రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఏకపక్ష విజయాలు సాధించిందని, గ్రామీణ ప్రాంతాల్లోనూ జడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ప్రజలు కూటమికి అండగా నిలిచారని పేర్కొన్నారు. గతంలో ఈవీఎంలపై ఆరోపణలు చేసిన వైసీపీకి, ఇప్పుడు బ్యాలెట్ ఎన్నికల్లోనూ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారని తెలిపారు. ప్రజల తీర్పు కూటమికి అనుకూలంగా ఉన్నప్పుడు దాన్ని అంగీకరించలేక ఆరోపణలు చేయడం వైసీపీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దౌర్జన్యాలు, దాడులు, రాజకీయ కక్షసాధింపు చర్యలు ప్రజలకు ఇంకా గుర్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ఎన్నికలు నిర్వహించిందని స్పష్టం చేశారు. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవహరించిన వారు, ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి తాను వెళ్లినట్లు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని ఖండించారు. తాను కౌంటింగ్ కేంద్రానికి వెళ్లలేదని, పోలింగ్ బూత్‌లోకి కూడా ప్రవేశించలేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించడం మానుకోవాలని హితవు పలికారు. నిజాలు ప్రజలకు తెలుసునని, తప్పుడు ప్రచారాలకు ప్రజలే తగిన సమాధానం చెబుతారని అన్నారు.
రాష్ట్రంలో ఎల్ నినో, సూపర్ ఎల్ నినో వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు కలగకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపుతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కరువు పరిస్థితుల్లోనూ ప్రజలకు అండగా నిలుస్తున్న కూటమి ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని అందించారని పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకొని ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, మనలో మనం విభేదాలు పెట్టుకోకుండా కూటమి ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కోరారు. వైసీపీకి ప్రజల తీర్పే సమాధానమని, కూటమి విజయ పరంపర గ్రామ పంచాయతీల్లోనూ కొనసాగుతుందన్నారు.




