Guntakal: గుంతకల్లులో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు!

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లులో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు.. డ్రోన్లతో నిఘా, డీజేలు, రాజకీయ పాటలపై నిషేధం పోలీసులు హెచ్చరిక.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 15 Sept 2026 6:12 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లులో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు!

Guntakal: ఈ నెల 16న గుంతకల్లు పట్టణంలో నిర్వహించనున్న వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నిమజ్జనం ఊరేగింపులో పాల్గొనే భక్తులు, ప్రజలు, వినాయక విగ్రహాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని గుంతకల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ఊరేగింపులో అధిక శబ్దంతో కూడిన డీజేలు ఏర్పాటు చేయరాదని, మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనరాదని సూచించారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు వినిపించడం, రాజకీయ పార్టీల జెండాలను ఊరేగింపు వాహనాలకు కట్టడం చేయరాదని స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విగ్రహాలను తరలించే ప్రతి వాహనం వెంట సంబంధిత విగ్రహ కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలని, పోలీసుల సూచనలకు అనుగుణంగా ఊరేగింపు నిర్వహించాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు, నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

డ్రోన్ కెమెరాలతో నిఘా

వినాయక నిమజ్జనం సందర్భంగా పట్టణంలో డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

భారీ పోలీస్ బందోబస్తు

నిమజ్జనం సందర్భంగా అనంతపురం జిల్లా పోలీస్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బందిని కూడా బందోబస్తుకు వినియోగించనున్నట్లు తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు నగర ఉత్సవ సమితి సభ్యులు, ప్రజలు, భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని గుంతకల్ 1 టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. మనోహర్ కోరారు.

ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు మనోహర్, వంశీకృష్ణ, ప్రవీణ్ కుమార్, ఎస్సైలు బాలముని, కళ్యాణ్‌తో పాటు నగర ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL