Anantapur: కూటమి రెండేళ్ల పాలనపై టీడీపీ ముఖ్య నేతల సమావేశం
Anantapur: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనంతపురంలో టీడీపీ సిద్ధమైంది.
Anantapur: కూటమి రెండేళ్ల పాలనపై టీడీపీ ముఖ్య నేతల సమావేశం
Anantapur: కూటమి రెండేళ్ల పాలనపై ప్రజలు పూర్తి హర్షం వ్యక్తం చేస్తుంటే, ఉనికిని కాపాడుకునేందుకే వైసీపీ నాయకులు నిరసనలు చేస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు విమర్శించారు. 3వ బుధవారం సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు. ఇందుకోసం ఈనెల 25 నుంచి ఆగష్టు 10వ తేదీ వరకు.. అంటే 45 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించారు.కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఊహించని స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని ఎమ్మెల్యే గుర్తుచేశారు.
రెండేళ్ల కాలంలో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ముఖ్యంగా పుట్టపర్తిలో యుద్ధవిమానాలు తయారు చేసే పరిశ్రమ రావడం, దాదాపు లక్ష కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు కానుండటం అనంతపురం జిల్లాకే ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో.. ఈనెల 19న రెండేళ్ల పాలన విజయాలపై జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మాట్లాడుతూ వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం తమ ఉనికి కోసమే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలోని కొందరు కార్యకర్తల మానసిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని, తమపైకే ఉసిగొల్పేలా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ సంస్కృతి ఒక్క వైసీపీకే సాధ్యమని విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ పాలనలో తాము పడిన కష్టాలను, వేధింపులను ఏ ఒక్క కార్యకర్త మర్చిపోవద్దని పూల నాగరాజు ఈ సందర్భంగా సూచించారు.
కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలా రాబోయే 45 రోజుల పాటు జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.




