MS Raju: అమర్‌నాథ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. వైసీపీ తీరుపై శ్రావణి, రాజు మండిపాటు!
MS Raju: హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యేలు ఎం.ఎస్. రాజు, బండారు శ్రావణి శ్రీ తీవ్రంగా ఖండించారు.
MS Raju: అమర్‌నాథ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. వైసీపీ తీరుపై శ్రావణి, రాజు మండిపాటు!
MS Raju: వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రత్యర్థి పార్టీల నేతలను, ముఖ్యంగా మహిళలను అవమానించే ధోరణిని ఆ పార్టీ కొనసాగిస్తూనే ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు ఎం.ఎస్. రాజు, బండారు శ్రావణి శ్రీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని, ఒక దళిత మహిళను అవమానించేలా ఆయన మాట్లాడటం సిగ్గుచేటని వారు మండిపడ్డారు.
ఒక మహిళా హోంమంత్రిపై అమర్‌నాథ్ అంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేసినా, వైసీపీ నేతలు ఎవరూ ఖండించకపోవడం బాధాకరమన్నారు. దీనిపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి, బహిరంగ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు.హోంమంత్రి అనిత పనితీరుపై ఏవైనా విమర్శలు ఉంటే రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా మాట్లాడాలి తప్ప.. వ్యక్తిగత దూషణలకు దిగడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
రాజకీయ విమర్శలు వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని స్పష్టం చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వైసీపీ నేతల మాటలు ఉన్నాయని ఆరోపించిన ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. మహిళలను అవమానించే ఏ ఒక్క వ్యాఖ్యను సహించే ప్రసక్తే లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వైసీపీ ఎప్పుడూ రౌడీయిజాన్ని, సోషల్ మీడియాలో మహిళలపై అనుచిత పోస్టులను ప్రోత్సహిస్తూ వచ్చిందని.. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అలాంటి వారిపై టీడీపీ చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని గుర్తు చేశారు.గతంలో 150 కి పైగా సీట్లు ఉన్న వైసీపీ.. నేడు కేవలం 11 సీట్లకు ఎందుకు పరిమితమైందో ఆ పార్టీ నేతలు గుర్తుంచుకోవాలి. ప్రజలు ఇచ్చిన తీర్పునైనా చూసి వైసీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా ఇటువంటి నీచ సంస్కృతిని వీడకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు.




