Rayadurgam: రాయదుర్గంలో విద్యుత్ విప్లవం: 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం
Rayadurgam: కనేకల్ మండలం పూలచెర్లలో MEIL ఆధ్వర్యంలో నిర్మించిన 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్‌ను ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ప్రారంభించారు.
Rayadurgam: రాయదుర్గంలో విద్యుత్ విప్లవం: 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రారంభం
Rayadurgam: రాయదుర్గం నియోజకవర్గంలో విద్యుత్ రంగంలో మరో మైలురాయి నమోదైంది. కనేకల్ మండలం పూలచెర్ల గ్రామంలో మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్‌ను ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఈ పనులను పూర్తి చేయడం విశేషం.
పూలచెర్ల గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సోలార్ ప్లాంట్ ద్వారా 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా MEIL సీఈవో శ్రీధర్, జీఎం శ్రీనివాసులు, ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకాష్ తదితరులు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుకు ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... రాష్ట్రంలో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో తక్కువ సమయంలో పూర్తి చేసుకున్న సోలార్ ప్లాంట్ ఇదేనని కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో మన నియోజకవర్గానికి సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడంతో పాటు, విశాఖపట్నం మరియు దావణగిరి ప్రాంతాలకు కూడా కరెంటు అందించే స్థాయికి ఎదుగుతామని స్పష్టం చేశారు.
పంటలు సక్రమంగా పండని ప్రాంతాలలో కూడా సోలార్ ప్రాజెక్ట్ల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగానే 7,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని రాయదుర్గంలోని ఎల్బీనగర్ వద్ద ఉన్న సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేయబోతున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి పెద్దపీట వేసారన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.




