Tadipatri: తాడిపత్రిలో నియంత పాలన.. జేసీ ప్రభాకర్‌పై వైసిపి తీవ్ర ఆరోపణలు!

Tadipatri: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నియంత పాలన సాగిస్తున్నారని వైసిపి నేతలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 24 Jun 2026 5:08 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రిలో నియంత పాలన.. జేసీ ప్రభాకర్‌పై వైసిపి తీవ్ర ఆరోపణలు!

తాడిపత్రి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనంతపురం జిల్లా తాడిపత్రిలో నియంత పాలన, అరాచకాలు కొనసాగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ రంగయ్య, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డిలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై, జేసీ ప్రభాకర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో జరుగుతున్న హత్యాకాండలను, దాడులను నియంత్రించడంలో విఫలమయ్యారని, పైగా ప్రతిపక్ష నేతలపై భౌతిక దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తాడిపత్రి ప్రత్యేక ప్రాంతమా జమ్మూ కాశ్మీర్ తరహాలో తాడిపత్రిని ఒక ప్రత్యేక ప్రాంతంగా ఊహించుకుంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు గంజాయి, నకిలీ మద్యం, హత్యలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

50 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నా వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలకు లొంగిపోయి, మామూళ్ల కక్కుర్తితో కేసులు కూడా నమోదు చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.నిన్నటి రోజున వైసీపీ కార్యకర్త, న్యాయవాది అయిన కేశవరెడ్డితో పాటు మరో ఇద్దరిపై మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన వారు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా, అక్కడ కూడా వందలాది మంది టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించి బీభత్సం సృష్టించారు.

ఆసుపత్రిపై దాడి జరుగుతున్న సమయంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి సకాలంలో అక్కడికి చేరుకున్నారు. గాయపడిన కేశవరెడ్డిని, ఇతర కార్యకర్తలను రక్షించి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు పెద్దారెడ్డి వివరించారు.తాడిపత్రిలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతోందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు జరిగిన సంఘటన పైన ఈనెల 26వ తారీకు తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపడతామని వైసిపి నాయకులు తెలియజేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story