Kadiri: హంద్రీనీవా లైనింగ్ పనుల్లో భారీ అవినీతి జరిగిందంటూ వైఎస్ఆర్సిపి ఆరోపణలు

Kadiri: కదిరిలో హంద్రీనీవా ప్రాజెక్టు పనుల్లో నాణ్యత లోపంపై వైఎస్సార్సీపీ నేతల ఆరోపణలు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 8 Jun 2026 10:30 AM IST
Kadiri
X

Kadiri: హంద్రీనీవా లైనింగ్ పనుల్లో భారీ అవినీతి జరిగిందంటూ వైఎస్ఆర్సిపి ఆరోపణలు

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి హంద్రీనీవా లైనింగ్ పనుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతోందంటూ వైఎస్సార్సీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీఎస్ మక్బూల్, మాజీ ఎంపీ తలారి రంగయ్య నల్లచెరువు, తనకల్లు మండలాల్లో హంద్రీనీవా పనులను పరిశీలించి పనుల నాణ్యతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

207 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన ప్రాజెక్టుకు అదనంగా 102కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ, పనుల్లో నాణ్యత కనిపించడం లేదని ఆరోపించారు. కాలువల గోడలు పూర్తికాకముందే పగుళ్లు రావడం, నాసిరకం నిర్మాణ సామగ్రి వినియోగించడం, పనుల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

ఎస్.ఆర్. కన్‌స్ట్రక్షన్స్ చేపడుతున్న పనులపై సమగ్ర విచారణ జరిపి, సంస్థను వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హంద్రీనీవా కాలువల పరిస్థితి కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, రైతుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

ప్రజాధనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం కాంట్రాక్టర్లకు అండగా నిలుస్తోందని ఆరోపించిన వైఎస్సార్సీపీ నేతలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన పనులు చేయించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story