Anantapur: వైఎస్సార్సీపీకి షాక్ ఎమ్మెల్యే దగ్గుపాటి సమక్షంలో టీడీపీలో చేరికలు!
Anantapur: అనంతపురం 48వ డివిజన్లో వైఎస్సార్సీపీకి బిగ్ షాక్. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరిన 40 కుటుంబాలు.
Anantapur: వైఎస్సార్సీపీకి షాక్ ఎమ్మెల్యే దగ్గుపాటి సమక్షంలో టీడీపీలో చేరికలు!
Anantapur: అనంతపురం నగరంలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కిన వేళ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. 48వ డివిజన్‌కు చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు అధికార తెలుగుదేశం పార్టీ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ఆధ్వర్యంలో (టిడిపి) తీర్థం పుచ్చుకున్నారు.
48వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ సంగాల సురేష్, వైసీపీ సోషల్ మీడియా నగర ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి.కార్యకర్తల చేరిక వీరితో పాటు 40కి పైగా కుటుంబాల వారు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు.
ఇంటింటికీ కూటమి ప్రభుత్వం
శనివారం సాయంత్రం 48వ డివిజన్లోని రజక నగర్లో 'ఇంటింటికీ కూటమి ప్రభుత్వం' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు కూడా ఆయన వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అందించిన సుపరిపాలన, చేసిన అభివృద్ధిని చూసే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. కొత్తగా చేరిన వారికి పార్టీలో తగిన ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వం వైఫల్యమే దీనికి కారణమని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. గత ఐదేళ్లలో 48వ డివిజన్లో వైసీపీ కార్పొరేటర్ ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ డివిజన్లో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
శాంతినగర్ బోర్డు నుంచి తపోవనం వరకు నూతన రోడ్డును నిర్మించామని చెప్పారు. వర్షం వస్తే రజక నగర్ ప్రాంతం ముంపునకు గురికావడానికి ఆక్రమణలే కారణమని గుర్తించి, రెవెన్యూ అధికారులతో కలిసి కబ్జాలను తొలగించామన్నారు. దీనివల్ల 5 డివిజన్లు, 14 కాలనీల ప్రజలకు ముంపు సమస్య తప్పిందని వివరించారు.
రూ. 78 కోట్లతో రక్షణ గోడలు నడిమి వంక, మరువ వంక ప్రాంతాల్లో వరద ముంపును నివారించేందుకు రూ. 78 కోట్ల అంచనా వ్యయంతో ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితిలో ఎవరు లేరని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ప్రజలు ఖచ్చితంగా పట్టం కడతారని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.




