Anantapur: అనంతపురంలో అర్ధనగ్న ప్రదర్శన: విద్యాకానుక కిట్ల కోసం వైసీపీ ఆందోళన!

Anantapur: అనంతపురంలో విద్యాకానుక కిట్ల పంపిణీ ఆలస్యంపై వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి సంఘాల నిరసన.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 23 Jun 2026 7:43 AM IST
Anantapur
X

Anantapur: అనంతపురంలో అర్ధనగ్న ప్రదర్శన: విద్యాకానుక కిట్ల కోసం వైసీపీ ఆందోళన!

Anantapur: అనంతపురంలో వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యాకానుక కిట్ల పంపిణీ ఆలస్యంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి, అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రాష్ట్రంలో పాఠశాలలు ప్రారంభమై పది రోజులు గడిచినా విద్యార్థులకు విద్యాకానుక కిట్లు అందించకపోవడంపై వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఈ సందర్భంగా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యాకానుక కిట్లు అందేవని గుర్తు చేశారు. ప్రస్తుతం విద్యాశాఖ నిర్వహణలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.

అలాగే అమ్మ ఒడి పథకాన్ని మార్చి అమలులో జాప్యం చేయడంతో పాటు, విద్యార్థులకు అందాల్సిన ప్రయోజనాలను తగ్గిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనులు నిలిచిపోయాయని, విద్యారంగం అస్తవ్యస్తంగా మారిందని అన్నారు.

విద్యార్థి విభాగం నేతలు చంద్రశేఖర్ యాదవ్, నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని పక్కనపెట్టి కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. విద్యాకానుక కిట్లు, ట్యాబ్‌ల పంపిణీని వెంటనే ప్రారంభించాలని, అసంపూర్తిగా ఉన్న నాడు-నేడు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story