Nandyal: నంద్యాలలో ఆరోగ్యశ్రీ సమ్మె.. అల్లాడుతున్న పేద రోగులు!
Nandyal: నంద్యాల జిల్లాలో బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి.
Nandyal: నంద్యాలలో ఆరోగ్యశ్రీ సమ్మె.. అల్లాడుతున్న పేద రోగులు!
నంద్యాల జిల్లా: నంద్యాలలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులు సమ్మె బాట పట్టాయి. దీనితో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నంద్యాల పట్టణంలో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉండటంతో ఇక సేవలు కొనసాగించడం కష్టమని ఆసుపత్రుల నిర్వాహకులు చెబుతున్నారు. ఆసుపత్రుల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ “సంవత్సరం నుండి బిల్లులు రావడం లేదు. ఖర్చులు పెరుగుతున్నాయి. ఇలా కొనసాగితే ఆసుపత్రులు నడపడం అసాధ్యం” అని తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు చెల్లించాలి. లేకపోతే పేదలకు సేవలు అందించడం కష్టమవుతుంది” అని హెచ్చరించారు.
2007లో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పటికీ అదే రేట్లతో కొనసాగుతుండటంతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఖర్చులు తీరడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాలలో 60కి పైగా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తుండగా, అత్యవసర చికిత్సలు అందించే 20 ఆసుపత్రులు కూడా సమ్మెలో చేరాయి.
ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో పేద రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర చికిత్సలు కూడా ఆలస్యం అవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే పేద ప్రజలు మాత్రం “మాకు ఆరోగ్యశ్రీ మీదే ఆధారం. ఇప్పుడు సేవలు లేకపోతే ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆధునిక వైద్య సదుపాయాలు అవసరమైన ఈ సమయంలో ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులు సరిపోవడం లేదని, ఆరోగ్యశ్రీ ట్రస్టులో డాక్టర్లకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని ఆసుపత్రుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.
ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలను విడుదల చేయకపోతే నంద్యాలలో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి సహా వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
మరి ఈ సమస్యపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..




