Weather Update : ఒకవైపు వడగాడ్పులు.. మరోవైపు ఉరుములతో కూడిన వానలు.. తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం

Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ముదురుతున్నాయి. 11 జిల్లాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

CR Reddy
Published on: 4 April 2026 7:45 AM IST
Weather Update
X

Weather Update

Weather Update : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పిచ్చెక్కిస్తోంది. ఒకవైపు భానుడు నిప్పులు చెరుగుతుంటే, మరోవైపు అకస్మాత్తుగా వానలు పలకరిస్తున్నాయి. ఎండ వేడికి తట్టుకోలేక జనాలు అల్లాడిపోతుంటే, వడగాలుల తీవ్రత మరింత భయపెడుతోంది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం రాబోయే రెండు రోజులు మరింత గండం పొంచి ఉంది.

మండిపోతున్న ఏపీ

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెగలు ఇప్పుడే పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో అత్యధికంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 డిగ్రీలు నమోదు కాగా, అనకాపల్లి, శ్రీకాకుళం, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. బయట అడుగు పెట్టాలంటేనే జనం భయపడే పరిస్థితి నెలకొంది.

73 మండలాల్లో రెడ్ అలర్ట్

ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు తోడవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రోజు ఏకంగా 73 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉంది. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం వంటి ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. మరో 17 మండలాల్లో సాధారణ వడగాలులు వీస్తాయి. ఆదివారం కూడా దాదాపు 53 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.

ఎండల మధ్యలో వర్షాలు

ఓవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. వాతావరణ శాఖ విశ్లేషణ ప్రకారం.. దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనివల్ల శని, ఆదివారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలోనూ అదే పరిస్థితి

తెలంగాణలో కూడా వాతావరణం భిన్నంగా ఉంది. హైదరాబాద్ సహా చాలా జిల్లాల్లో శుక్రవారం నుంచి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అయితే రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం జనం వాన చినుకుల కోసం ఎదురుచూస్తున్నారు. వాతావరణంలో వస్తున్న ఈ అకస్మాత్తు మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

Next Story