Annadata Sukhibhava : ఏపీ రైతులకు బంపర్ గిఫ్ట్.. నేడు 46 లక్షల మంది ఖాతాల్లోకి కోట్లాది రూపాయలు

Annadata Sukhibhava : ఏపీలో అన్నదాత సుఖీభవ పథకం కింద నేడు (మార్చి 13) రైతుల ఖాతాల్లో రూ.6,000 చొప్పున జమ చేయనున్నారు. పీఎం కిసాన్ నిధులతో కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు గన్నవరంలో ఈ నిధులను విడుదల చేస్తారు.

CR Reddy
Updated on: 13 March 2026 7:44 AM IST
Annadata Sukhibhava
X

Annadata Sukhibhava

Annadata Sukhibhava : ఏపీలోని అన్నదాతలకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ(Annadata Sukhibhava) పథకం నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో భాగంగా గురువారం మాట్లాడిన ఆయన, నేడు అంటే మార్చి 13, శుక్రవారం నాడు రైతుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని లక్షలాది రైతు కుటుంబాలకు ఎంతో మేలు జరగనుంది.

ఈ పథకం ద్వారా లభించే ఆర్థిక సాయం వివరాలను పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ (PM Kisan) నిధులను, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభవ నిధులను కలిపి ఒకేసారి అందిస్తున్నారు. కేంద్రం విడుదల చేసే రూ.2,000కు తోడు, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,000 జోడించి, మొత్తం రూ.6,000 చొప్పున ప్రతి రైతు ఖాతాలో జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 46.80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు రూ.2,808 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. గన్నవరంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

కేంద్రం కూడా అదే రోజున గౌహతిలో నిర్వహించే సభ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తుండటంతో, ఏపీ ప్రభుత్వం కూడా అదే సమయానికి ఈ సాయాన్ని అందించేలా ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇది మూడో విడత నిధుల పంపిణీ అని, రైతులు తమ పెట్టుబడి అవసరాలకు ఈ సొమ్మును వాడుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రకటనతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

అంతేకాకుండా కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మరికొన్ని కీలక హామీలు ఇచ్చారు. సంక్షేమ పథకాలు ఎప్పుడు అమలవుతాయనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు త్వరలోనే సంక్షేమ పథకాల క్యాలెండర్ ను విడుదల చేస్తామని ప్రకటించారు. దీనివల్ల ప్రజలకు పథకాలపై ఎప్పుడు వస్తాయనే ఆందోళన ఉండదని ఆయన స్పష్టం చేశారు. అలాగే రాబోయే ఉగాది నాటికి అర్హులైన పేదలకు కొత్త ఇళ్లను కేటాయిస్తామని, ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు జల జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కుళాయి కనెక్షన్ కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలనకు పి4 (P4) కార్యక్రమాన్ని డ్వాక్రా సంఘాల సహకారంతో ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు.

CR Reddy

CR Reddy

Next Story