AP 10th Class Exams : ముగిసిన ఏర్పాట్లు.. ఉదయం 9.30 గంటలకే మొదలవనున్న ఏపీ టెన్త్ ఎగ్జామ్స్

AP 10th Class Exams : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటలకే పరీక్ష ప్రారంభం కానుండగా, విద్యార్థుల కోసం ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది.

CR Reddy
Published on: 16 March 2026 7:31 AM IST
AP 10th Class Exams 2026
X

AP 10th Class Exams 2026

AP 10th Class Exams : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి విద్యార్థుల భవితవ్యానికి కీలకమైన పరీక్షల పర్వం నేటి నుంచే మొదలుకానుంది. సోమవారం (మార్చి 16) ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు దాదాపు 15 రోజుల పాటు సాగే ఈ పరీక్షల కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది మొత్తం 6,40,916 మంది విద్యార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 3.28 లక్షల మంది బాలురు, 3.12 లక్షల మంది బాలికలు ఉన్నారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి.

పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు ఈసారి చాలా కఠినంగా ఉన్నాయి. విద్యార్థులు గంట ముందే, అంటే ఉదయం 8.30 గంటలకే కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించే ప్రసక్తే లేదని అధికారులు స్పష్టం చేశారు. హాల్ టికెట్లు లేనిదే ప్రవేశం ఉండదు కాబట్టి, విద్యార్థులు తమ వెంట హాల్ టికెట్ ఉంచుకోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. హాల్ టికెట్ చూపిస్తే బస్సులో ఎటువంటి ఛార్జీ లేకుండా ప్రయాణించవచ్చు.

పరీక్షా గదిలో ఇచ్చే ఓఎంఆర్ షీట్ విషయంలో విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. షీట్‌పై ఉన్న పేరు, ఫోటో, రోల్ నెంబర్ మీవేనా కాదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి. ఏ చిన్న తప్పు ఉన్నా వెంటనే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలి. సమాధానాలు రాయడానికి మొదట 24 పేజీల బుక్‌లెట్ ఇస్తారు. అది సరిపోకపోతే అదనంగా మరో 12 పేజీల బుక్‌లెట్ అడిగి తీసుకోవచ్చు. కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే వాడాలి. పెన్సిల్, ఎరేజర్ వంటి అవసరమైన వస్తువులను వెంట తెచ్చుకోవచ్చు కానీ, మొబైల్ ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు అనుమతి లేదు.

రాష్ట్రవ్యాప్తంగా 3,415 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, వీటిని పర్యవేక్షించేందుకు 38,958 మంది సిబ్బందిని నియమించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించారు. వీటితో పాటు 210 కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించి అక్కడ సీసీటీవీ కెమెరాల నిఘా ఉంచారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ శాఖను, శాంతిభద్రతల కోసం పోలీస్ శాఖను ప్రభుత్వం సమన్వయం చేస్తోంది. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతి కేంద్రంలో తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు, ఏఎన్ఎం సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

పరీక్షల కోసం విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని, ప్రశాంతంగా రాయాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి లేదా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో బెంచీలు, సరైన వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాసి, మంచి ఫలితాలు సాధించాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

CR Reddy

CR Reddy

Next Story