AP Cabinet : అమరావతి ఈజ్ పర్మినెంట్.. ఇక మార్చే మొనగాడు లేడు.. బాబు సర్కార్ మాస్టర్ ప్లాన్
AP Cabinet : ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు మార్చి 28న అసెంబ్లీలో తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 1730 ఉద్యోగాల భర్తీ, ఆస్తి పన్ను వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపింది.
AP Cabinet : ఏపీ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో అమరావతి భవితవ్యంపై కీలక తీర్మానం చేశారు. గతంలో జరిగినట్లుగా భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి ఆలోచనలు తలెత్తకుండా, పర్మినెంట్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ అసెంబ్లీలో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
అమరావతికి అడ్డులేని చట్టబద్ధత
ఏపీ రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2014-19 మధ్య రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అయోమయం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేవలం కేబినెట్ తీర్మానం సరిపోదని, అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించి, అమరావతి చట్టబద్ధత బిల్లును ఆమోదించనున్నారు. రాజధానిపై గతంలో జరిగిన కక్షపూరిత చర్యలకు చెక్ పెట్టడమే దీని ముఖ్య ఉద్దేశమని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు.
నిరుద్యోగులకు, న్యాయ వ్యవస్థకు పెద్ద పీట
రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ప్రతిపాదనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 96 కొత్త కోర్టుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ కోర్టుల నిర్వహణ కోసం ఏకంగా 1730 కొత్త పోస్టుల నియామకానికి పచ్చజెండా ఊపింది. ఇది నిరుద్యోగులకు గొప్ప అవకాశంగా మారనుంది. అలాగే, అమరావతిలోని ఎస్ఆర్ఎం (SRM) యూనివర్సిటీలో 60 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణాలకు అనుమతినిస్తూ నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు.
సామాన్యులకు పన్ను కష్టాల నుంచి విముక్తి
ప్రజలకు ఊరటనిచ్చేలా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలపై ఉన్న వడ్డీని పూర్తిగా మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు విద్యుత్ రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 5 నుంచి 14వ తేదీ మధ్య ప్రతి నియోజకవర్గంలో 2 వేల సూర్యఘర్ కనెక్షన్లు (సోలార్) మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే సబ్ స్టేషన్ల వద్ద బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల ఏర్పాటుకు ఆమోదం లభించింది. వడ్డెర సంఘాలకు ఆర్థికంగా తోడ్పాటునిచ్చేలా క్వారీ లీజుల్లో ప్రత్యేక రాయితీలు కల్పించాలని మంత్రిమండలి నిర్ణయించింది.




