CM Chandrababu : లక్ష మందికి ఉద్యోగ ఉపాధి..రూ.1.40 లక్షల కోట్లతో మెగా స్టీల్ ప్లాంటుకు చంద్రబాబు శ్రీకారం
CM Chandrababu : విశాఖలో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు రేపు భూమిపూజ చేయనున్నారు. లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ మెగా ప్రాజెక్టు ఏపీ ముఖచిత్రాన్ని మార్చనుంది.
CM Chandrababu
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో రేపు (మార్చి 23, 2026) ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడబోతోంది. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చేసేలా ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా(AM/NS India) ఏర్పాటు చేయనున్న మెగా స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వేదికగా జరగనున్న ఈ కార్యక్రమం, రాష్ట్రానికి లక్షలాది ఉద్యోగాలను, వేల కోట్ల పెట్టుబడులను తీసుకురాబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలించింది. సుమారు రూ.1,35,964 కోట్ల భారీ పెట్టుబడితో 5,465 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగనుంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ఈ ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ప్లాంట్‌లలో ఒకటిగా నిలుస్తుంది.
సొంతంగా క్యాప్టివ్ పోర్టు.. మరో 6 వేల ఉద్యోగాలు
ఈ ప్రాజెక్టు కేవలం స్టీల్ ప్లాంట్‌కే పరిమితం కాలేదు. ముడి సరుకుల రవాణా, ఎగుమతుల కోసం ఏఎంఎన్ఎస్ సంస్థ ప్రత్యేకంగా ఒక క్యాప్టివ్ పోర్టును కూడా నిర్మించనుంది. దీని కోసం అదనంగా రూ.11,198 కోట్లు ఖర్చు చేయనున్నారు. 316 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ పోర్టు ద్వారా మరో 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ స్టీల్ ప్లాంట్. పోర్టు కలయికతో విశాఖ ఎకనమిక్ రీజియన్ అంతర్జాతీయ స్థాయిలో ఒక పారిశ్రామిక హబ్‌గా మారబోతోంది.
శరవేగంగా మౌలిక సదుపాయాల కల్పన
ఇంతటి భారీ పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్, రవాణా సౌకర్యాలను కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదు. ప్లాంట్‌ను నేషనల్ హైవే-16తో అనుసంధానించేందుకు ప్రత్యేకంగా 4 లేన్ల రహదారిని ప్రభుత్వం నిర్మిస్తోంది. గడిచిన 21 నెలలుగా ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల వల్లనే ఇంతటి మెగా ప్రాజెక్టు సాకారం అవుతోంది. ఈ ప్లాంట్ వల్ల ఏపీ జీఎస్డీపీ గణనీయంగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఇదే
సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి హెలికాప్టర్ ద్వారా నక్కపల్లి మండలం రాజయ్యపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3:40 గంటలకు ప్లాంట్ నమూనాను పరిశీలించిన అనంతరం, కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, ఇతర మంత్రులతో కలిసి భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత లక్ష్మీ మిట్టల్, ఆయన కుమారుడు ఆదిత్య మిట్టల్ కూడా పాల్గొనడం విశేషం. పారిశ్రామిక దిగ్గజాలందరూ ఒకే వేదికపైకి రావడం ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచనుంది.




