CM Chandrababu: చంద్రబాబు చొరవ.. పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ నీటి కష్టాలకు చెక్
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు జల్ జీవన్ మిషన్ 2.0 ఒప్పందం. 2028 డిసెంబర్ నాటికి లక్ష్యం పూర్తి.
CM Chandrababu: చంద్రబాబు చొరవ.. పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ నీటి కష్టాలకు చెక్
CM Chandrababu: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో కీలకమైన ముందడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. జల్ జీవన్ మిషన్ 2.0 అమలు దిశగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మినిస్టరీ ఆఫ్ జల శక్తి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు ఎంఓయూ పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా 2028 డిసెంబర్ నాటికి ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాకారం చేయాలని రెండు ప్రభుత్వాలు సంకల్పించాయి.
ఈ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ ఆర్ పాటిల్ ప్రత్యక్షంగా పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్నారు. ఈ ఒప్పందంపై ఇద్దరు నేతలు హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఇది కీలకమైన అడగని పేర్కొన్నారు.
జల్ జీవన్ మిషన్ను 2028 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలికింది. ముఖ్యంగా సేవల అందజేతలో మెరుగుదల, ప్రజల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికి సురక్షితమైన, స్థిరమైన తాగునీరు అందించాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే తమ ఎన్నికల హామీల్లో ఒకటని, ఈ దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.
ఇక, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనులను గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరారు.
ఈ ఎంఓయూలో కేంద్ర జలశక్తి కార్యదర్శి అశోక్ కుమార్ మీనా, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. తాజా ఒప్పందంతో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పంచాయతీల ఆధ్వర్యంలో నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
తాగునీటి సరఫరా వ్యవస్థల ఆపరేషన్, మెయింటెనెన్స్ బాధ్యతలను పంచాయతీలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2025 సెప్టెంబర్లో సమగ్ర విధానాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.ఇదే సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0ను విస్తరించినట్లు తెలిపారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ ఈ అంశంపై చర్చించినట్లు వెల్లడించారు. ఈ మిషన్ పొడిగింపుకు ఆయన చేసిన ప్రతిపాదనకు కృతజ్ఞతలు తెలిపారు.జల్ జీవన్ మిషన్ తొలి దశలో దేశవ్యాప్తంగా 16 కోట్ల గృహాలకు తాగునీటి కనెక్షన్లు అందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రాజెక్టులో ఉన్న లోపాలను సవరించి, నిర్వహణను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. ఇంకా 3 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీరు అందించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఏపీలో నీటి నాణ్యత పరీక్ష కోసం డ్వాక్రా మహిళల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్ల మహిళలకు దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చే కష్టాలు తప్పనున్నాయని వివరించారు. జల్ జీవన్ మిషన్ 2.0 ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందే లక్ష్యం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాధించాలంటే ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడం అత్యంత అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రైతులకు సాగునీరు కూడా సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో ఏపీ జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించి, ప్రాజెక్టు లక్ష్యాలను నిర్దేశించనున్నట్లు చెప్పారు.
జల్ జీవన్ మిషన్ 2.0 ఒప్పందం గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక మైలురాయిగా నిలవనుంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యం త్వరలోనే సాకారం అవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.




