AP Temple Priests Rules: ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు..అర్చకులు విదేశాలకు వెళ్తే... ఆ అర్హత కోల్పోతారు
AP Temple Priests Rules: ఏపీ ఆలయాల్లో అర్చకులు నిర్వహించే పూజల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Temple Priests Rules: ఏపీ హైకోర్ట్ కీలక ఆదేశాలు..అర్చకులు విదేశాలకు వెళ్తే... ఆ అర్హత కోల్పోతారు
AP Temple Priests Rules: ఏపీ ఆలయాల్లో అర్చకులు నిర్వహించే పూజల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు నిర్ణయం ప్రకారం, విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు అలయ గర్భగుడిలో ప్రవేశించి పూజలు చేయరాదని పేర్కొంది. మార్చి 30, 2026న ఈ తీర్పు వెలువడింది. దీంతో ఏపీలోని ఆలయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.
అమలుకాని మార్గదర్శకాలు
ఈ కేసు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద కోర్టు ముందుకు వచ్చింది. విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన అర్చకుడు డీఎస్ఎస్ఎస్ సుబ్రహ్మణ్యం సోమయాజి ఈ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. ధార్మక పరిషత్ సర్క్యులర్, శృంగేరి శారదాపీఠం మార్గదర్శకాలు ఆలయాల్లో సరిగా అమలు కావడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. 2010లో ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు. అయితే, పిటిషనర్ తరపు న్యాయవాది వాదనల ప్రకారం, ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు కఠినమైన ఆచారాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లడం అనేది సంప్రదాయాలకు విరుద్దం. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లినా తిరిగి వచ్చిన తరువాత ఆలయ గర్భగుడిలో పూజలు చేయడానికి అర్హత కోల్పోతారని కోర్టుకు వివరించారు. ఇలా విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులు గర్భగుడిలో కాకుండా ఆలయ ప్రాంగణంలో జరిగే పూజలు, వ్రతాల్లో మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు.
శృంగేరి శారదాపీఠం ప్రామాణికం
శృంగేరి శారదా పీఠం ప్రామాణికం ప్రకారం ఎవరైతే గర్భగుడిలో పూజలు చేస్తారో ఆ అర్చకుడు ప్రతిరోజూ మూడుసార్లు తప్పకుండా సంధ్యావందనం చేయాలి. వేద అధ్యయనం, గురు ఉపదేశం, నియమిత జపం వంటి ఆధ్యాత్మిక నియమాలను ఖచ్చితంగా పాటించాలి. అదేవిధంగా ఆహార నియమాలు, శరీర శుద్ది వంటి అంశాల్లో కూడా క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది. ఈ నియమాలను విదేశాల్లో పాటించడం సాధ్యం కాదని కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు దేవాదాయ శాఖకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. శృంగేరి శారదాపీఠం మార్గదర్శకాలను, గతంలో జారీ చేసిన సర్క్యులర్‌ను తప్పనిసరిగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించారు. గర్భగుడిలో పూజలు నిర్వహించే అర్చకులు ఈ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిందేనని తీర్పులో పేర్కొన్నారు.
తీర్పు ప్రభావం
రాష్ట్రంలోని సుమారు 10 వేలకు పైగా ఉన్న ఆలయాలపై ఈ తీర్పు ప్రభావం చూపనుంది. అర్చకుల నియామకాలు, విధులు, బాధ్యతలు అన్నీ కూడా ఇకపై మార్గదర్శకాల ప్రకారమే ఉండనున్నాయి. ఈ తీర్పు తరువాత ఆలయ వ్యవస్థలో మరింత క్రమశిక్షణ, పాదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ తీర్పు సంప్రదాయాలను, ఆచారాలను కాపాడే దిశగా ఉందని చెప్పవచ్చు. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టడంలోనూ, ఆలయ పవిత్రతను కాపాడటంలోనూ ఈ నిర్ణయం కీలక పాత్రను పోషిస్తుందనడంలో సందేహం లేదు.




