CM Chandrababu: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ‘3C’ మంత్రం.. పెట్టుబడుల సాధనలో మీరే కీలకం!
CM Chandrababu: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే బాధ్యత కేవలం శాఖలకే పరిమితం కాకుండా జిల్లా కలెక్టర్లు కూడా ముందుండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
CM Chandrababu: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ‘3C’ మంత్రం.. పెట్టుబడుల సాధనలో మీరే కీలకం!
CM Chandrababu: రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే బాధ్యత కేవలం శాఖలకే పరిమితం కాకుండా జిల్లా కలెక్టర్లు కూడా ముందుండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు సమావేశంలో పెట్టుబడులు, పర్యాటక రంగాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాల్లో పెట్టుబడులు రాబట్టేందుకు కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు “3C ఫార్ములా”ను కూడా సీఎం ప్రకటించారు. కమిట్మెంట్, కన్విన్స్, కో-ఆపరేట్ అనే మూడు అంశాలతో పెట్టుబడిదారులను ముందుకు తీసుకురావాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు త్వరగా గ్రౌండ్ అవ్వాలంటే అనుమతులు వేగంగా ఇవ్వాలని సీఎం సూచించారు.
భూ కేటాయింపులు కూడా యుద్ధ ప్రాతిపదికన జరిగేలా చూడాలని అన్నారు. పెట్టుబడులు వస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి ప్రజల తలసరి ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ఎకనామిక్ రీజియన్‌లుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆయా ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక అధికారులను నియమించినట్టు వెల్లడించారు. ఓర్వకల్లు, కొప్పర్తి వంటి ప్రాంతాలను పెద్ద పారిశ్రామిక హబ్‌లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.
జిల్లాల వారీగా “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంలో ర్యాంకులు ఇస్తామని సీఎం ప్రకటించారు. ఏ జిల్లాలో పరిశ్రమలు రాకపోతే అక్కడ టూరిజం, ఐటీ, ఎంఎస్ఎంఈలు లేదా వ్యవసాయ రంగాలను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాల ప్రత్యేకతలను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేయాలని తెలిపారు. పెట్టుబడిదారులు తమ దగ్గరకు రావాలని ఎదురుచూడకుండా, వారిని కలిసే ప్రయత్నం కలెక్టర్లు చేయాలని అన్నారు. పర్యాటక రంగంలో కూడా రాష్ట్రానికి అపార అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అందుకే పర్యాటకానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని చెప్పారు.
పాపికొండలు, గండికోట, సూర్యలంక వంటి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 50 వేల హోటల్ గదులు ఏర్పాటు చేయాలని, హోమ్ స్టేలు, కన్వెన్షన్ సెంటర్లు పెంచాలని సూచించారు. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేసి, ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.




