Amaravati: పర్యాటక రంగంలో బాబు మార్క్..అంతర్జాతీయ స్థాయికి ఏపీ టూరిజం!
Amaravati: ఏపీ పర్యాటక రంగంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. 2029 నాటికి 50 వేల హోటల్ గదులు, 10 వేల హోం స్టేల ఏర్పాటు లక్ష్యం.
Amaravati: పర్యాటక రంగంలో బాబు మార్క్..అంతర్జాతీయ స్థాయికి ఏపీ టూరిజం!
Amaravati: అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడంలో వేగం పెంచాలని, పెట్టుబడులను ఆకర్షించేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని సీఎం సూచించారు.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ద్వారా ఇప్పటికే ఆమోదం పొందిన పర్యాటక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమయపాలనతో పనులు పూర్తి చేస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా 2029 నాటికి రాష్ట్రంలో 50 వేల హోటల్ గదులను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు.
పర్యాటకులకు వసతి సదుపాయాల విస్తరణలో భాగంగా 10 వేల హోం స్టేలను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో హోం స్టేలు అభివృద్ధి చేస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యాటకులకు సాంప్రదాయ జీవన శైలిని అనుభవించే అవకాశం కలుగుతుందని వివరించారు. అదే సమయంలో విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఆధునిక అమ్యూజ్మెంట్ పార్కుల ఏర్పాటు కోసం సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
కారావాన్ టూరిజంపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. కారావాన్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు కారావాన్ పార్కుల ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ విధంగా కొత్త తరహా పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.
అటవీ, దేవాదాయ శాఖల మధ్య సమన్వయంతో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రకృతి సోయగాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సమన్వయం చేస్తే దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రసాద్, స్వదేశ్ దర్శన్ కింద చేపట్టే ప్రాజెక్టులను 2026 మే నాటికి సిద్ధం చేయాలని గడువు విధించారు.
ఈ పథకాల కింద మరిన్ని అభివృద్ధి పనుల కోసం రూ.663 కోట్ల విలువైన ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు అధికారులు వివరించారు. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గండికోట, సూర్యలంక, అరకు, బొర్రా గుహలు వంటి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.
అలాగే గోదావరి పుష్కరఘాట్ అభివృద్ధి పనులు, హావ్లాక్ బ్రిడ్జిపై పర్యాటకులను అనుమతించే ఏర్పాట్లు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రానికి మరింత పర్యాటక ఆకర్షణ పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
పర్యాటక రంగాన్ని ఆర్థికాభివృద్ధికి కీలక సాధనంగా మలచాలని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సమగ్ర ప్రణాళిక, సమయపాలన, సమన్వయంతో ముందుకు సాగితే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.




