Rajam: జనం మధ్యకు వెళ్లండి.. సమస్యలు తీర్చండి.. కలెక్టర్ ఆదేశం!

Rajam: రాజాం మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు. సచివాలయ రికార్డులు, సిబ్బంది హాజరు పరిశీలన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 24 March 2026 5:10 PM IST
Rajam
X

Rajam: జనం మధ్యకు వెళ్లండి.. సమస్యలు తీర్చండి.. కలెక్టర్ ఆదేశం!

రాజాం, మార్చి 24: ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే సచివాలయ సిబ్బంది తరచూ ప్రజలతో మమేకం కావాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. మంగళవారం రాజాంలో పర్యటించిన ఆయన మున్సిపాల్టీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ముందుగా లచ్చయ్యపేట–1, సారధి మిట్టిరెడ్డి వీధి సచివాలయాలను తనిఖీ చేసి సిబ్బంది హాజరు, రికార్డులను పరిశీలించారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ప్రభుత్వ సేవల అమలులో వెనుకబడి ఉన్న సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపర్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేందుకు సేవలను మరింత మెరుగుపర్చాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని సూచించారు.

అంగన్వాడీ కేంద్రం తనిఖీ..

రాజాం పట్టణంలోని సారధి అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి రికార్డులు, స్టాక్ వివరాలు పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. చిన్నారులతో మాట్లాడి వారి అవగాహన స్థాయిని తెలుసుకున్నారు. పిల్లలకు సకాలంలో పోషకాహారం అందించాలని అంగన్వాడీ వర్కర్‌కు ఆదేశించారు. మంచి సేవల ద్వారా ప్రజల సంతృప్తి పెంచాలని సూచించారు.

ఈ పర్యటనలో తహసీల్దార్ ఎం. రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story