Nellore: ఘనంగా YSRTUC ఆవిర్భావ దినోత్సవం

Nellore: నెల్లూరులో జరిగిన 14వ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 March 2026 7:09 PM IST
Nellore
X

Nellore: ఘనంగా YSRTUC ఆవిర్భావ దినోత్సవం

Nellore: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్సార్ టీయూసీ విభాగం జిల్లా అధ్యక్షుడు పి.జయకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 14 వ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (YSRTUC) ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు, వైఎస్ఆర్ సీపీ ముఖ్య నాయకులు , కార్యకర్తలతో కలిసి పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు మాజీ మంత్రివర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

అనంతరం మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు పార్టీ నేతలు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (YSRTUC) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ కేక్ కట్ చేసి, కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు నాయకులు.

ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ..

చంద్రబాబు, లోకేశ్‌లకు దమ్ముంటే ఉద్యోగాల జాబితా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను, కార్మికులను దారుణంగా వంచిస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు మొండిచేయి చూపించి, మోసం చేస్తుందని ఎద్దేవా చేశారు కాకాణి.

ఎన్నికల ముందు మెగా డీఎస్సీ పై మొదటి సంతకం అని చెప్పిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన తరువాత, మొదటి సంతకం చేసి, చాలా రోజుల పాటు వాయిదా వేయడం, చంద్రబాబు మొదటి సంతకానికి విలువ లేకుండా పోయిందన్నారు.

నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం చెబుతున్నవన్నీ 'కాకి లెక్కలే'నని, చంద్రబాబు, లోకేష్ లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఏ సచివాలయ పరిధిలో, ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో జాబితాను ధైర్యంగా ప్రకటించగలరా అని ప్రశ్నించారు. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా వివరాలు బయటపెట్టే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? అంటూ మండిపడ్డారు.

రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం, వాస్తవానికి పరిశ్రమల పేరుతో ప్రభుత్వ భూములను కారుచౌకగా (99 పైసలకే) తమ అనుయాయులు కట్టబెడుతూ దోపిడీకి ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు కాకాణి.

మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు, కానీ పరిశ్రమల పేరిట మీరు చేస్తున్న దోపిడీకి, ప్రచార ఆర్భాటాలకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పారు, కార్మికులకు ఎప్పుడూ అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్మికుల భద్రతకు, సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణమే స్పందించి అండగా నిలిచే సంప్రదాయం జగన్ దని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కార్మికుల భద్రత గాలిలో కలిసిపోయిందని చెప్పారు.

ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పి, అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలతో పాటు కార్మిక వర్గాన్ని కూడా చంద్రబాబు మోసం చేశాడని, "విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు" అని గతంలో నినదించిన చంద్రబాబు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కార్మికుల పట్ల అగౌరవంగా మాట్లాడుతున్నాడని చెప్పారు .

రాష్ట్రంలోని యూనిట్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కార్మికుల భద్రత గాలిలో కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఉండేదని, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి, సమీక్షలు నిర్వహించి, బాధితులకు అండగా నిలిచేవారని గుర్తు చేశారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సమీక్షలు గానీ, కార్మికుల భద్రత పట్ల శ్రద్ధ గానీ లేదని, రాష్ట్రంలో జాబ్ మేళాల పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా, ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని, కంపెనీల వారీగా ఎక్కడెక్కడ ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో జాబితా బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

అధికారంలో ఉన్నా లేకపోయినా, కార్మికుల పక్షాన నిలబడతామని, ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా ఉపేక్షించబోమని, అండగా నిలుస్తామని చెప్పారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల కోరికల సాధన కోసం, వారి కష్టాలు తీర్చడం కోసం ముందుంటామని భరోసా ఇచ్చారు కాకాణి గోవర్ధన్ రెడ్డి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story