Stree Shakti Scheme: స్త్రీ శక్తి పథకంపై జగన్ వ్యాఖ్యలు అర్థరహితం.. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
Stree Shakti Scheme: స్త్రీ శక్తి పథకంపై ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తప్పుపట్టారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందిన పథకం అని చెప్పారు
Stree Shakti Scheme
Stree Shakti Scheme: స్త్రీ శక్తి పథకం అమలుపై పులివెందుల ఎమ్మెల్యే జగన్ చేసిన వ్యాఖ్యలను రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలలో ఇదొకటని మంత్రి చెప్పారు. ప్రభుత్వం బాధ్యతతో ఈ పథకాన్ని అమలు చేస్తుంటే జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు. ఈ పథకం ద్వారా మహిళలకు ప్రతినెల రూ.2000 వరకు ప్రయోజనం కలుగుతోందని, ఇప్పటివరకు సుమారు 50 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎక్కువగా ప్రయాణించే ఐదు రకాల బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని, ఈ సేవలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయలేదని మంత్రి విమర్శించారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం సుమారు 1450 కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
వైసీపీ పాలనలో టికెట్ ధరల పెంపు, బస్సు సర్వీసుల నిలిపివేత..
వైసీపీ పాలనలో బస్సు టికెట్ ధరలను మూడు సార్లు పెంచారని, వందలాది బస్సు సర్వీసులను నిలిపివేశారని మంత్రి ఆరోపించారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంలో కూడా నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శించారు.
ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి చర్యలు
గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ ఎదుర్కొన్న అనేక సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మహిళల సాధికారత, ప్రజా రవాణా బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.




