Nellore: రైతులకు అండగా నాదెండ్ల మనోహర్.. కోవూరులో ధాన్యం కేంద్రాల తనిఖీ!
Nellore: నెల్లూరు జిల్లా కోవూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. 22% తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా.
Nellore: రైతులకు అండగా నాదెండ్ల మనోహర్.. కోవూరులో ధాన్యం కేంద్రాల తనిఖీ!
నెల్లూరు జిల్లా: కోవూరు నియోజకవర్గం ఇనమడుగులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తేమశాతం కొలతను స్వయంగా పరిశీలించారు.
నెల్లూరు జిల్లా సాగు చాలా ప్రత్యేకమైనదని, రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే 40 నుంచి 60 రోజులు ఆలస్యంగా సాగు దిగుబడి వచ్చే ప్రాంతం ఇదని చెప్పారు.
రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయాలి అనే ఉన్నతమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందని చెప్పారు.. వైసిపి ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ఒక్క ధాన్యం గింజ కొనుగోలు చేయలేదని, అసలు ధాన్యం సేకరణ చేయకుండా రైతులను నిలువునా ముంచారని విమర్శించారు..
ధాన్యం కొనుగోలులో అప్పటి ప్రభుత్వ నాయకులు గోల్ మాల్ చేసి రూ. 82 కోట్ల మేర అవినీతి చేశారని.. వైసిపి నాయకులు రోలెక్సు వాచీలతో తిరిగితే.. అన్నం పెట్టే సగటు రైతు మొర వినే నాధుడు లేక వేదన పడ్డాడని గుర్తు చేశారు..
నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో మెల్లగా వ్యవస్థలను క్రమబద్ధీకరణ చేస్తున్నామని, గత ఏడాది 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, ఈ ఏడాది 2 నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికే 60 వేల మెట్రిక్ టన్నులు సేకరించామని తెలిపారు..
రైతులంతా ప్రభుత్వానికి మాత్రమే అమ్మండి అని పిలుపునిచ్చారు.. చివరి వరకు ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని మాటిచ్చారు.. ధాన్యం అమ్మిన ఎనిమిది గంటల్లో డబ్బులు వేసేలా చూస్తున్నామని, క్షేత్రస్థాయిలోనూ రైతులు డబ్బులు వేగంగా పడుతున్నాయని చెప్పడం ఆనందంగా ఉందని వివరించారు.
ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా కల్లాలు ఏర్పాటు చేస్తామని, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ చొరవతో ఉపాధి హామీ నిధులతో.. ప్రతి నియోజకవర్గంలో కల్లాలు ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
రైతులకు తేమ సమస్య అనేది ఉందని. 22 శాతం తేమ ఉన్నా ధాన్యం తీసుకునేలా ఆదేశాలిస్తామని భరోసా ఇచ్చారు. దీంతోపాటు ఆధునిక డ్రోన్లు ఇచ్చిన తరహాలోనే, డ్రయర్లు కూడా రైతులకు అందుబాటులో ఉంచుతామని వాగ్దానం చేశారు.
రైతులు ఏ రైస్ మిల్ కు ధాన్యం ఇవ్వాలి అనేది వారి సొంత నిర్ణయమని, పూర్తిగా వారు ఇష్టప్రకారమే రైస్ మిల్లును ఎంచుకోవచ్చు అని చెప్పారు. దీనిపై అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు..
జిల్లాలోని రైస్ మిల్లులు అన్నీ వెంటనే బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలని. అలా కాని పక్షంలో వాటిని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. మిల్లర్ల అవకతవకలు, నిర్లక్ష్యం సహించేది లేదని చెప్పారు.
కూటమి ప్రభుత్వం వ్యవస్థలో మార్పు కోసం కష్టపడుతోందని, లోపాలను కచ్చితంగా అధిగమిస్తామని వ్యవస్థను రైతులకు అనుగుణంగా. స్నేహపూర్వకంగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటామని భరోసా ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్.




