Nellore: వైసీపీ పాపం.. కూటమి పుణ్యం రూ. 1674 కోట్ల ధాన్యం బకాయిలపై మంత్రి క్లారిటీ

Nellore: నెల్లూరు కోవూరులో ధాన్యం కేంద్రాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్. 22% తేమ ఉన్నా ధాన్యం కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 March 2026 1:42 PM IST
Nellore
X

Nellore: వైసీపీ పాపం.. కూటమి పుణ్యం రూ. 1674 కోట్ల ధాన్యం బకాయిలపై మంత్రి క్లారిటీ

నెల్లూరు జిల్లా: కోవూరు నియోజకవర్గం ఇనమడుగు లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తేమశాతం కొలతను స్వయంగా పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.

వైసీపీ ప్రభుత్వం 2024 లో ఎన్నికల సంవత్సరం కూడా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించకుండా బకాయి పెట్టింది. రూ. 1674 కోట్ల రూపాయల రైతుల డబ్బును వేరే పథకాలకు మళ్ళించి, రైతులకు బకాయి పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ డబ్బులు చెల్లించే బాధ్యతను తీసుకుంది.

వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, కూటమి ప్రభుత్వం రాగానే 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకోగలిగాం.

వ్యవస్థలో పొరపాట్లు వల్ల రైతులు కన్నీరు పెట్టకూడదు అన్నది ప్రభుత్వ లక్ష్యం. నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు 3 వేల పైబడి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి, రూ. 160 కోట్లు జమ చేసాం.

రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రాసెస్ చేసిన అనంతరం మన బిడ్డలకు మధ్యాహ్న భోజనంలో సన్నబియంగా అందించే ప్రక్రియ చాలా ఉత్తమమైనది. సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజనాన్ని వారికి అందించి కూటమి ప్రభుత్వం బిడ్డల భవిష్యత్తుకు కూడా భరోసా ఇస్తోంది.

ప్రతి బస్తా మీద రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు ముద్రించి క్యూఆర్ కోడ్ సహాయంతో, వారి వివరాలు అందరికీ తెలిసేలా రైతుకు తగిన గౌరవం ఇస్తున్నాం. ఎవరి వద్ద, ఎక్కడ పండింది అని అన్ని వివరాలు దానిలో ఉంటాయి.

గత వైసిపి ప్రభుత్వం రైతులను మోసం చేసి, 80 90 కిలోమీటర్ల మేర రైస్ మిల్లులకు ధాన్యం ఇవ్వాలని చెబితే కూటమి ప్రభుత్వం మాత్రం రైతులకు స్నేహపూర్వకంగా రైస్ మిల్లులు ఎంచుకునే విధంగా ఒక పద్ధతిని తీసుకొచ్చింది. రైతులు తమకు దగ్గరలో ఉన్న అనువైన రైస్ మిల్లును ఎంచుకోవచ్చు అక్కడికి ధాన్యం తోలవచ్చు. వాట్సప్ ద్వారా కూడా సాంకేతికంగా రైస్ మిల్లును ఎంచుకునే వెసులుబాటు కల్పించాం.

నెల్లూరు జిల్లా సాగు చాలా ప్రత్యేకమైనది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే 40 నుంచి 60 రోజులు ఆలస్యంగా సాగు దిగుబడి వచ్చే ప్రాంతం ఇది.

రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయాలి అనే ఉన్నతమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసింది. వైసిపి ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా నుంచి ఒక్క ధాన్యం గింజ కొనుగోలు చేయలేదు.

ధాన్యం కొనుగోలులో అప్పటి ప్రభుత్వ నాయకులు గోల్ మాల్ చేసి రూ. 82 కోట్ల మేర అవినీతి చేశారు. వైసిపి నాయకులు రోలెక్సు వాచీలతో తిరిగితే, అన్నం పెట్టే సగటు రైతు మొర వినే నాధుడు లేక వేదన పడ్డాడు.

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో మెల్లగా వ్యవస్థలను క్రమబద్ధీకరణ చేస్తున్నాం. గత ఏడాది 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే, ఈ ఏడాది 2 నుంచి 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే 60 వేల మెట్రిక్ టన్నులు సేకరించాం.

రైతులంతా ప్రభుత్వానికి మాత్రమే అమ్మండి. చివరి వరకు ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తాం. ధాన్యం అమ్మిన ఎనిమిది గంటల్లో డబ్బులు వేసేలా చూస్తున్నాం. క్షేత్రస్థాయిలోనూ రైతులు డబ్బులు వేగంగా పడుతున్నాయని చెప్పడం ఆనందంగా ఉంది.

ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా కల్లాలు ఏర్పాటు చేస్తాం. గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవ తో ఉపాధి హామీ నిధులతో ప్రతి నియోజకవర్గంలో కల్లాలు ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటాం.

రైతులకు తేమ సమస్య అనేది ఉంది. 22 శాతం తేమ ఉన్నా ధాన్యం తీసుకునేలా ఆదేశాలిస్తాం. దీంతోపాటు ఆధునిక డ్రోన్లు ఇచ్చిన తరహాలోనే డ్రయర్లు కూడా రైతులకు అందుబాటులో ఉంచుతాం.

జిల్లాలోని రైస్ మిల్లులు అన్నీ వెంటనే బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలి. రైతులను ఇబ్బంది పెట్టి ఇష్టానుసారం వ్యవహరించే మిల్లులు ఎవరైనా ఉపేక్షించేది లేదు. రైతులను ఇబ్బంది పెడితే బ్లాక్లిస్టులో పెడతాం. మిల్లర్ల అవకతవకలు పాల్పడిన, నిర్లక్ష్యం వహించినా సహించేది లేదు.

కూటమి ప్రభుత్వం వ్యవస్థలో మార్పు కోసం కష్టపడుతోంది. క్షేత్రస్థాయిలో లోపాలను మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న మీడియాకు ధన్యవాదాలు. లోపాలను కచ్చితంగా సవరించుకుంటాం. అవసరమైతే ఒకరోజు నెల్లూరు జిల్లాలోనే ఉండి మొత్తం వ్యవస్థను సరిజేసేలా చర్యలు తీసుకుంటాను. లోపాలను కచ్చితంగా అధిగమిస్తాం. వ్యవస్థను రైతులకు అనుగుణంగా, స్నేహపూర్వకంగా తయారు చేసే బాధ్యతను తీసుకుంటాం.

స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించాం. త్వరలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా గోధుమపిండి పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నాం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story