Visakhapatnam: పురాతన వంటకాలపై పెరిగిన మక్కువ.. శబల ఉత్సవంలో పంచకర్ల సందడి
Visakhapatnam: విశాఖపట్నం సింహాచలం కొత్త గోసాల వద్ద జరిగిన 'శబల - 2026' సుస్థిర జీవన పరిచయ ఉత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు.
Visakhapatnam: పురాతన వంటకాలపై పెరిగిన మక్కువ.. శబల ఉత్సవంలో పంచకర్ల సందడి
విశాఖపట్నం: సింహాచలం కొత్త గోసాల కృష్ణాపురం వద్ద ఏప్రిల్ 1 నుండి 5 వరకు జరిగిన శబల 2026 సుస్థిర జీవన పరిచయ ఉత్సవంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
నిర్వహకులు విజయరామరాజు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రమేష్ బాబు ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన కళాకారులకు బహుమతులు మెమెంటోలు అందజేశారు. అలాగే ఉత్సవంలో ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాల్స్ ను పరిశీలించారు. కుండల వంటకాలు, నేత తయారీ లు, గానుగ నూనెలు, సాంప్రదాయ ఆహార తయారీలను పరిశీలించి నిర్వాహకుల తాపత్రయాన్ని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ. సుమారు 60 ఏళ్ల క్రితం నాటి వంటకాలను ప్రజలకు పరిచయం చేస్తూ, వారి ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న శబల నిర్వాహకులు ప్రశంసనీయులని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవస్థలో పురాతన వంటకాల పట్ల ప్రజలకు ఆసక్తి బాగా పెరిగిందని, తాత్కాలిక రుచులు తిని తక్కువకాలం బతికే కన్నా, సాంప్రదాయ ఆహారం తిని సుదీర్ఘ కాలం బతకాలన్న ఆశ ప్రజల్లో బాగా పెరిగిందన్నారు. తాను కూడా సాంప్రదాయ వంటకాలనే ఆహారంగా తీసుకుంటున్నట్లు తెలిపారు.
శబల నిర్వహకులు చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆహారపు అలవాట్లు మార్చుకొని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రజలకు సూచించారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న శబల 2026 సుస్థిర జీవన విధానం ఉత్సవాల్లో వేలాది మంది ప్రజలు పాల్గొనడం ఆనందంగా ఉందని, అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తపరిచారని తెలిపారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రమేష్ బాబు పేర్కొన్నారు.




