Nandyal: 600 ఏళ్ల నాటి అహోబిలం సంప్రదాయంపై పార్లమెంట్‌లో చర్చ!

Nandyal: నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అహోబిలం పారువేట ఉత్సవానికి యునెస్కో వారసత్వ హోదా కల్పించాలని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 April 2026 5:36 PM IST
Nandyal
X

Nandyal: 600 ఏళ్ల నాటి అహోబిలం సంప్రదాయంపై పార్లమెంట్‌లో చర్చ!

నంద్యాల జిల్లా: అహోబిలం పారువేట ఉత్సవానికి యునెస్కో గుర్తింపు కోసం పార్లమెంట్‌లో ఎంపీ బైరెడ్డి శబరి గళం..600 ఏళ్ల సంప్రదాయానికి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి..

నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, అహోబిలం పారువేట ఉత్సవానికి యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ హోదా కల్పించాలని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

గురువారం లోక్‌సభలో మాట్లాడిన ఎంపీ బైరెడ్డి శబరి, నల్లమల అడవుల్లో ఉన్న అహోబిలం క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి అంకితమైన పవిత్రక్షేత్రమని వివరించారు. నరసింహ స్వామి ఉగ్రరూపంలో అవతరించిన స్థలంగా అహోబిలం విశేష ప్రాధాన్యత కలిగి ఉందని చెప్పారు.

ప్రహ్లాదుడిని రక్షించి, హిరణ్యకశిపుడిని సంహరించిన మహావిష్ణువు అవతారం నరసింహుడి తొమ్మిది రూపాలతో ‘నవ నరసింహ’ క్షేత్రంగా అహోబిలం ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ క్షేత్రం భక్తి, ధైర్యం, దైవకృపకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

అహోబిలం పరిసర అటవీ ప్రాంతంలోని 33 గ్రామాల్లో సుమారు 40 రోజుల పాటు జరిగే ‘పారువేట ఉత్సవం’ ప్రత్యేకతను ఆమె లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆరు శతాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఈ ఉత్సవం విశ్వాసం, భక్తి, సామాజిక సామరస్యానికి నిలువెత్తు ఉదాహరణ అని చెప్పారు.

ఈ ఉత్సవంలో నరసింహ స్వామి విగ్రహాన్ని ప్రతి వీధి, ప్రతి ఇంటికి ఊరేగిస్తూ భక్తులను ఆశీర్వదించే సంప్రదాయం ఉందని తెలిపారు. చెంచు గిరిజన సమాజంతో ఈ ఉత్సవానికి ప్రత్యేకమైన అనుబంధం ఉందని, నరసింహ స్వామి చెంచు లక్ష్మిని వివాహం చేసుకున్నారనే విశ్వాసం దీనికి ఆధారం అని వివరించారు.

పారువేట ఉత్సవం ఒక సజీవ సంప్రదాయంగా తరతరాలకు సంక్రమిస్తూ వస్తోందని, మౌఖిక సంప్రదాయాలు, ఆలయ ఆచారాలు, సామూహిక భాగస్వామ్యాన్ని పరిరక్షిస్తోందని పేర్కొన్నారు. ఈ ఉత్సవం సామాజిక ఐక్యతను బలోపేతం చేస్తూ, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోందని అన్నారు.

అహోబిలం పారువేట ఉత్సవానికి యునెస్కో అమూర్త సాంస్కృతిక వారసత్వ హోదా సిఫార్సు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ బైరెడ్డి శబరి లోక్‌సభలో అధికారికంగా విజ్ఞప్తి చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story