Nandyala: మీ ఇంటికి మీ డాక్టర్.. మొబైల్ మెడికల్ యూనిట్ ప్రారంభం

Nandyala: నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ‘మీ ఇంటికి – మీ డాక్టర్’ మొబైల్ మెడికల్ యూనిట్‌ను ప్రారంభించారు. రూ.1.20 కోట్ల వ్యయంతో రెడ్ క్రాస్ సహకారంతో బండి ఆత్మకూరు మండలంలోని 15 గ్రామాల్లో ఈ యూనిట్ సేవలు అందించనుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 2:08 PM IST
Nandyala
X

Nandyala: మీ ఇంటికి మీ డాక్టర్.. మొబైల్ మెడికల్ యూనిట్ ప్రారంభం

నంద్యాల: నంద్యాల జిల్లాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత చేరువ చేసేందుకు జిల్లా యంత్రాంగం సరికొత్త అడుగు వేసింది. ‘మీ ఇంటికి – మీ డాక్టర్’ ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.1.20 కోట్ల వ్యయంతో సిద్ధం చేసిన అత్యాధునిక మొబైల్ మెడికల్ యూనిట్‌ను జిల్లా కలెక్టర్ రాజకుమారి గారు సోమవారం అధికారికంగా ప్రారంభించారు.

కలెక్టరేట్‌లో ప్రారంభోత్సవం:

నంద్యాల కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ (PGRS) ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, డీఆర్వో రాము నాయక్ లతో కలిసి కలెక్టర్ ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమం అమలు కానుంది.

మారుమూల గ్రామాలకు అభయం:

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాల్లో నివసించే పేదలకు, ఆసుపత్రులకు రాలేని వారికి ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, యువత స్వచ్ఛందంగా రక్తదాన శిబిరాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే మహిళలు అన్ని రంగాల్లో నాయకత్వ స్థానాల్లోకి రావాలని, సామాజిక చైతన్యంతోనే వివక్షను నిర్మూలించగలమని ఆమె ఆకాంక్షించారు.

ఈ మొబైల్ మెడికల్ యూనిట్ ఈ ఏడాది మార్చి నుండి మే నెల వరకు నంద్యాల జిల్లాలోని బండి ఆత్మకూరు మండలంలోని 15 గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వైద్య పరీక్షలు, సేవలు అందించనుంది.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, సాంకేతిక నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు మరియు రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story