Nara Lokesh: కేవలం ఒక జూమ్ కాల్‌తోనే ఇంత పెద్ద ప్లాంట్ తెచ్చాం
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
Nara Lokesh: కేవలం ఒక జూమ్ కాల్‌తోనే ఇంత పెద్ద ప్లాంట్ తెచ్చాం
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రాజెక్టు కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర తలరాతను మార్చే అద్భుత అవకాశమని ఆయన అభివర్ణించారు.
ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న కృషిని లోకేశ్ వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "2019లోనే ఆదిత్య మిత్తల్‌ను కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరాను. 2024లో ప్రజలు మమ్మల్ని గెలిపించిన వెంటనే మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశాం. కేవలం ఒక జూమ్ కాల్ ద్వారానే ఈ భారీ గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగాం" అని ఆయన వెల్లడించారు.
పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న నమ్మకమే ఈ ప్రాజెక్టుకు ప్రధాన కారణమని, వేగంగా అనుమతులు ఇచ్చిన కేంద్ర మంత్రి కుమారస్వామికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా అనకాపల్లి పేరు ప్రపంచ పటంలో నిలుస్తుందని లోకేశ్ పేర్కొన్నారు.
తన పాదయాత్రలో ప్రజలు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కోరలేదని, తమ పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలని అడిగారని గుర్తు చేశారు. ఈ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తుందని, ఇది ఉత్తరాంధ్ర ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మారుస్తుందని స్పష్టం చేశారు. ఏపీని పారిశ్రామికంగా నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.




