Sompeta: ఆరు నెలల నిల్వ.. అద్భుతమైన దిగుబడి

Sompeta: సోంపేట మండలం పాలవలసలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన. ఘనజీవామృతం ప్రయోజనాలపై అధికారుల వివరణ.

G.RAMBABU, SOMPET
Published on: 7 April 2026 7:21 PM IST
Sompeta
X

Sompeta: ఆరు నెలల నిల్వ.. అద్భుతమైన దిగుబడి

Sompeta: సోంపేట మండలం పాలవలసలో ప్రకృతి వ్యవసాయ అధికారి, సిబ్బంది ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రైతులకు అవగాహన కల్పించారు. 300 కిలోల నాణ్యమైన ఘన జీవామృతం తయారు చేసి దాని ప్రాముఖ్యత, వినియోగం, ప్రయోజనాలను వివరించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ. ప్రకృతి వ్యవసాయం రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే సుస్థిర సాగు విధానమని తెలిపారు.

రసాయన ఎరువులు, పురుగుమందులపై ఆధారపడకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న పదార్థాలతో తయారు చేసే ఘనజీవామృతంతో పంటలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందుతాయని అన్నారు. ఒక ఎకరాకు సుమారు 400 కిలోల ఘనజీవామృతం పొడి వినియోగిస్తే యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువుల అవసరం లేకుండా పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయని, ఇది నేలలో సూక్ష్మజీవుల వృద్ధిని పెంచి భూసారాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

దీని వినియోగంతో పంటల వేరుశాతం బలపడటంతో పాటు దిగుబడి నాణ్యత మెరుగుపడుతుందని చెప్పారు. అదేవిధంగా ఘనజీవామృతం నిల్వ సామర్థ్యం సుమారు ఆరు నెలల వరకు ఉంటుందని, ముందుగానే తయారు చేసుకుని అవసరానికి అనుగుణంగా రైతులు వినియోగించుకోవచ్చని సూచించారు. రసాయన సాగుతో పోలిస్తే ప్రకృతి సాగు పద్ధతులు నేల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా, సాగు వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని పేర్కొన్నారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో రైతులకు ఘనజీవామృతం తయారీ విధానం, నిల్వ పద్ధతులు, ఎకరానికి అవసరమైన మోతాదు, వాడే సమయం వంటి అంశాలపై ప్రాయోగికంగా వివరించారు. గ్రామ రైతులు ఆసక్తిగా పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీఏఏ, ప్రకృతి వ్యవసాయ శిబ్బంది, ఐసీఆర్పీ తిరుమల, స్వాతి, శ్రావణి, మహేష్, జయలక్ష్మి, హైమావతి, గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story