Palamaner: రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత.. ఎమ్మెల్యే నల్లారి
Palamaner: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మదర్ థెరిసా కళాశాలలో విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
Palamaner: రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత.. ఎమ్మెల్యే నల్లారి
Palamaner: రోడ్డు భద్రత మనందరి సామాజిక బాధ్యత అని పలమనేర్ శాసన సభ్యులు అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని మదర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు సిబ్బందికి హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ పలు కీలక సూచనలు చేశారు.
రోడ్డు భద్రత - హెల్మెట్ ప్రాధాన్యత పై తెలియజేశారు.
కేవలం హెల్మెట్లు పంపిణీ చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం కాదని, వాటిని ధరించడం వల్ల కలిగే రక్షణ గురించి అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా ISI గుర్తు ఉన్న నాణ్యమైన హెల్మెట్లను మాత్రమే వాడాలని ఆయన సూచించారు. రోడ్డు పక్కన దొరికే నాసిరకం హెల్మెట్లు వాడటం వల్ల ప్రమాద సమయంలో సరైన రక్షణ లభించదని హెచ్చరించారు. ఇక రాత్రి సమయాల్లో హెల్మెట్ గ్లాస్‌పై పడే లైటింగ్ రిఫ్లెక్షన్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండ కలిగి ఉండాలని కోరారు.
లైసెన్స్ లేని విద్యార్థుల కోసం కాలేజీలోనే ప్రత్యేక క్యాంప్‌లు ఏర్పాటు చేసి లైసెన్స్‌లు ఇప్పించేందుకు రవాణా శాఖ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. టీనేజ్ వయస్సులో వేగంగా వాహనాలు నడపాలనే ఉత్సాహం ఉంటుందని, కానీ అది ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఒక చిన్న పొరపాటు వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, దానివల్ల మీ కుటుంబం మొత్తం ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరించారు. ఇక మాదకద్రవ్యాల (Drugs)కు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలన్నారు.
డ్రగ్స్ వల్ల యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని.ఆవేదన వ్యక్తం చేశారు. ఏ విధమైన చెడు వ్యసనాలకు, ప్రలోభాలకు లోనుకాకుండా కేవలం చదువుపైనే దృష్టి పెట్టాలని హితవు పలికారు. మీరు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదిగితే అది మీ కుటుంబానికి మరియు మీరు చదువుకున్న సంస్థలకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఇక మీదట,
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విద్యార్థులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ మధుసూదన్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంభూపాల్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు సోమశేఖర్ గౌడ్, ప్రసాద్ నాయుడు,భరత్, జయసింహా,రహీంభాషా, శ్రీనివాసులు, సురేష్, బాలాజీ, రవి మరియు కళాశాల యాజమాన్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


