Janasena Formation Day: గిరిజన పల్లెల్లో జనసేనాని.. పవన్ కళ్యాణ్ 'అడవితల్లి బాట'!

Janasena Formation Day: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 14 March 2026 11:19 AM IST
Janasena Formation Day: గిరిజన పల్లెల్లో జనసేనాని.. పవన్ కళ్యాణ్ అడవితల్లి బాట!
X

Janasena Formation Day: గిరిజన పల్లెల్లో జనసేనాని.. పవన్ కళ్యాణ్ 'అడవితల్లి బాట'!

Janasena Formation Day: జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో నిర్వహించేందుకు పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో జరిగే వేడుకల్లో స్వయంగా పాల్గొంటూ గిరి పుత్రుల మధ్య ఈ వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం పాడేరు నియోజకవర్గంలోని నంది గరువు అనే గిరిజన గ్రామంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా ఓనూరు జంక్షన్ వద్ద జనసేన పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు.

అనంతరం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న Pradhan Mantri Janjati Adivasi Nyaya Maha Abhiyan (PM-JANMAN) పథకం, అలాగే Mahatma Gandhi National Rural Employment Guarantee Act కింద ఏజెన్సీ ప్రాంతాల్లో చేపట్టిన రహదారి నిర్మాణ పనులను పరిశీలించనున్నారు.ఈ సందర్భంగా ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు గ్రామం వరకు పీఎం జన్ మన్ పథకం నిధులతో నిర్మించిన సుమారు 2.4 కిలోమీటర్ల రహదారిని పవన్ కళ్యాణ్ కాలి నడకన పరిశీలించనున్నారు. రహదారి నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేస్తూ మార్గమధ్యంలో గిరిజనులతో మమేకం అవుతారు. గ్రామ ప్రజల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు.

అనంతరం “అడవితల్లి బాట” కార్యక్రమం ద్వారా నిర్మాణం పూర్తయిన పలు రహదారులను పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ రహదారులు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. ఈ రోడ్లు పూర్తి కావడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు సులభతరం అవుతాయని భావిస్తున్నారు..తర్వాత నందిగరువు గ్రామ ప్రజలతో నిర్వహించే “మాటా-మంతి” కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. గ్రామస్తుల సమస్యలు, అభివృద్ధి అవసరాలపై నేరుగా చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. కార్యక్రమం ముగింపులో గిరిజనులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గిరిజన ప్రాంతాల్లో జరపడం ద్వారా గిరిపుత్రులతో పార్టీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు, గిరిజన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.




హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story