Arava Sridhar : రైల్వేకోడూరులో అరాచకం.. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళపై జనసేన నేతల దాడి
Arava Sridhar : రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై జనసేన నాయకులు దాడికి దిగారు. పోలీసుల చేతిలోని లాఠీని లాక్కొని మరి బాదడం స్థానికంగా కలకలం రేపింది.
Railway Koduru Tension
Arava Sridhar : అమరావతిని రాజధానిగా చేస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందిన తరుణంలో, రైల్వేకోడూరు పట్టణంలో కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర సహా పలువురు కార్యకర్తలు ప్రధాన రహదారిపైకి వచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేపై గతంలో లైంగిక ఆరోపణలు చేసిన ఓ ఉద్యోగిని, ఆమె తరపు న్యాయవాది సోదరుడు గోపితో కలిసి టోల్‌గేట్ సమీపంలోని పూల దుకాణం వద్దకు వచ్చారు. ఆమెను చూడగానే జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు.
పోలీసుల ముందే వీరంగం
ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ అక్కడ కనిపించడంతో ఆగ్రహానికి గురైన జనసేన నేతలు ఆమెపైకి దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా దౌర్జన్యానికి దిగారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఏకంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసుల చేతిలోని లాఠీని బలవంతంగా లాక్కొని సదరు మహిళపై, ఆమెతో ఉన్న గోపిపై దాడి చేశారు. గోపిని కొడుతూ.. ఊరు వదిలి వెళ్ళిపోవాలి అంటూ రోడ్డుపై పరిగెత్తించారు. ఈ గొడవ జరుగుతున్నంత సేపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తన కారులోనే ఉండి అంతా చూస్తుండటం గమనార్హం.
మీడియాపైనా ప్రతాపం
ఈ అరాచకాన్ని కవర్ చేస్తున్న ఒక విలేకరిపై కూడా జనసేన నాయకులు ప్రతాపం చూపించారు. దాడి దృశ్యాలను రికార్డ్ చేస్తున్న సదరు జర్నలిస్టును కొట్టి, అతని మొబైల్‌లోని వీడియో ఫుటేజీని బలవంతంగా డిలీట్ చేయించారు. బహిరంగ ప్రదేశంలో, వందలాది మంది చూస్తుండగా, పోలీసుల సమక్షంలోనే ఇంతటి దౌర్జన్యం జరగడం పట్టణంలో భయాందోళనలు కలిగించింది. శాంతిభద్రతలను కాపాడాల్సిన నాయకులే స్వయంగా లాఠీలు పట్టుకుని దాడికి దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసుల నిస్సహాయత
ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై దాడులు జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారని, కనీసం లాఠీని కూడా కాపాడుకోలేకపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అండ చూసుకునే నాయకులు ఇంతగా రెచ్చిపోతున్నారని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.




