Rajam: మంచి చేస్తున్నా అడ్డుతగులుతారా? గ్రామస్తుల ఆగ్రహం
Rajam: రాజాం డోలపేటలో స్మశాన వాటిక అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rajam: మంచి చేస్తున్నా అడ్డుతగులుతారా? గ్రామస్తుల ఆగ్రహం
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలోని డోలపేటలో స్మశాన వాటిక అభివృద్ధి విషయంలో వివాదం నెలకొంది. గ్రామానికి చెందిన గోకవరపు మహేష్ అనే యువకుడు గత ఏడు సంవత్సరాలుగా గ్రామ ప్రజల అనుమతితో స్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు. పేద–ధనిక తేడా లేకుండా అంత్యక్రియలకు అవసరమైన కట్టెలను ఉచితంగా అందించడంతో పాటు, ఖర్మకాండలు నిర్వహించుకునే ఆర్థిక స్థోమత లేని పేద కుటుంబాలకు తన సొంత ఖర్చుతో సహాయం చేస్తూ సేవలు అందిస్తున్నారు.
అయితే ఈ స్మశాన వాటిక కాలేజీలు, హాస్పిటల్, స్కూల్‌కు వెళ్లే ప్రధాన దారిలో ఉండటంతో మహిళలు, పిల్లలు ఆ మార్గంలో వెళ్లడానికి భయపడుతున్నారని గుర్తించిన మహేష్, గ్రామ ప్రజల అనుమతితో అక్కడ శివుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టారు. అలాగే చితాభస్మాన్ని భద్రపరచేందుకు ప్రత్యేకంగా లాకర్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు.
ఈ విధంగా స్మశాన వాటిక అభివృద్ధికి మహేష్ చేసిన కృషిని గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు. అయితే గ్రామంలోని కొంతమంది వ్యక్తులు ఈ అభివృద్ధిని ఓర్వలేక వివిధ రకాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంచి పని జరుగుతున్నప్పుడు కొందరు సమస్యలు సృష్టించడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.




