Sri City: కార్మికుల పిల్లల చదువుల కోసం ₹67 లక్షల విద్యా నిధి

Sri City: తిరుపతి జిల్లా శ్రీసిటీలో ప్రముఖ ఆఫీస్ ఫర్నిచర్ తయారీ సంస్థ రాక్‌వర్త్ ₹70 కోట్ల పెట్టుబడితో తన ప్లాంట్‌ను విస్తరిస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 3:52 PM IST
Sri City
X

Sri City: కార్మికుల పిల్లల చదువుల కోసం ₹67 లక్షల విద్యా నిధి

Sri City: తిరుపతి జిల్లా తడ మండలాల్లోని శ్రీసీటీ ఆఫీస్ ఫర్నిచర్ తయారీ అగ్రగామి సంస్థ రాక్‌వర్త్ సిస్టమ్స్ ఫర్నీచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సుమారు ₹70 కోట్ల పెట్టుబడితో తమ శ్రీసిటీ తయారీ యూనిట్‌ను విస్తరించనుంది. నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శైలేష్ కుమార్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి కంపెనీ ఆవరణలో సంప్రదాయ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ విస్తరణ ప్రణాళికను ప్రకటించారు.

అలాగే, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా తన తల్లి జ్ఞాపకార్థం మీనాదేవి మెమోరియల్ ఫౌండేషన్ పేరిట ఆర్థికంగా వెనుకబడిన కంపెనీ కార్మికుల కుటుంబాలకు చెందిన పిల్లలకు విద్యా సహాయం అందిస్తున్నట్లు శైలేష్ కుమార్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి 37 మంది కొత్త లబ్ధిదారులకు సుమారు ₹67 లక్షల విలువైన విద్యా సహాయం చెక్కులను పంపిణీ చేసిన ఆయన, దీనితో కలిపి ఇప్పటివరకు 100 మంది పిల్లలకు ఈ సాయం అందించామని తెలిపారు.

తమ సంస్థ సామాజిక బాధ్యత పట్ల కట్టుబడి ఉందని, విద్యారంగ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తూ, మరెంతో మంది విద్యార్థుల భవిష్యత్తు మెరుగుపడేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ప్లాంట్ విస్తరణతో శ్రీసిటీ పారిశ్రామిక వృద్ధికి తోడ్పడటమే కాకుండా, సంస్థ చేపట్టిన విద్యా చేయూత కార్యక్రమాలు ఆదర్శనీయమంటూ రాక్‌వర్త్ యాజమాన్యాన్ని అభినందించారు.

2011లో శ్రీ సిటీలో స్థాపించబడిన రాక్‌వర్థ్ సంస్థ ఆధునిక తయారీ సాంకేతికతలతో ఆఫీస్ ఫర్నిచర్ ఉత్పత్తిలో ప్రముఖ స్థానం సంపాదించింది. సుమారు 400 మందికి ఉపాధి కల్పిస్తూ, అందులో 90 శాతం స్థానిక ఉపాధికి పెద్దపీట వేసింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story