Nandyala: కన్నవారినే కాటికి పంపాడు.. డబ్బు కోసం ఘాతుకం!

Nandyala: నంద్యాల జిల్లా అవుకులో ఘోరం జరిగింది. మద్యానికి బానిసైన ఆంజనేయులు అనే యువకుడు, అప్పులు తీర్చేందుకు డబ్బులు ఇవ్వలేదని తన తల్లిదండ్రులపై కట్టెతో దాడి చేశాడు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 23 March 2026 10:27 AM IST
Nandyala
X

Nandyala: కన్నవారినే కాటికి పంపాడు.. డబ్బు కోసం ఘాతుకం!

అవుకు (నంద్యాల జిల్లా): మద్యం మత్తు మనిషిని మృగంగా మార్చింది. కన్నవారు అని కూడా చూడకుండా, కేవలం డబ్బు కోసం ఒక కుమారుడు కర్కశత్వానికి ఒడిగట్టాడు. మద్యం తాగేందుకు, చేసిన అప్పులు తీర్చేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తల్లిదండ్రులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటన నంద్యాల జిల్లా అవుకు పట్టణంలో చోటుచేసుకుంది.

ఘటన వివరాల్లోకి వెళ్తే:

అవుకు పట్టణానికి చెందిన శేఖర్, లక్ష్మీదేవి దంపతులకు ఆంజనేయులు అనే కుమారుడు ఉన్నాడు. ఆంజనేయులు గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బయట వ్యక్తుల వద్ద సుమారు 50 వేల రూపాయల వరకు అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చడానికి, మళ్ళీ మద్యం తాగడానికి డబ్బులు కావాలంటూ నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేవాడు.

ఈ క్రమంలోనే నిన్న రాత్రి మరోసారి డబ్బుల విషయంలో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగాడు. వారు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆంజనేయులు, ఇంట్లో ఉన్న బలమైన కట్టెతో తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. వారి తలలపై విచక్షణారహితంగా బాదడంతో తల్లి లక్ష్మీదేవి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తండ్రి శేఖర్ తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి శేఖర్‌ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story