Srikakulam: గద్దలపాడు గ్రామస్థుల గోడు.. ఎన్నికల హామీలకే పరిమితమైన రహదారి!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో గద్దలపాడు గ్రామ రహదారి బురదమయమైన దారిలో విద్యార్థుల అవస్థలు, అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల నిరసన.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 19 March 2026 12:10 PM IST
Srikakulam
X

Srikakulam: గద్దలపాడు గ్రామస్థుల గోడు.. ఎన్నికల హామీలకే పరిమితమైన రహదారి!

కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల పరిధిలోని పురుషోత్తపురం పంచాయతీ గద్దలపాడు గ్రామ ప్రజలు సరైన రహదారి సౌకర్యం లేక నరకయాతన అనుభవిస్తున్నారు. దశాబ్దాలు గడుస్తున్నా తమ ఊరికి రోడ్డు భాగ్యం కలగలేదని, కనీసం నడవడానికి కూడా వీల్లేకుండా దారి తయారైందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బురదమయంగా మారిన బాట.. విద్యార్థుల అవస్థలు

గ్రామానికి వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా దెబ్బతినడంతో రోజువారీ రాకపోకలు కష్టసాధ్యంగా మారాయి. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ బురదలోనే ప్రయాణించాల్సి వస్తోంది. వర్షాకాలం వస్తే ఈ సమస్య మరింత జటిలమవుతుందని, గ్రామం బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అత్యవసర వేళల్లో అగచాట్లు.. అధికారుల నిర్లక్ష్యం!

గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం చేసినా లేదా గర్భిణీలను ఆసుపత్రికి తరలించాలన్నా అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని బాధితులు పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు "రోడ్డు వేయిస్తాం" అని హామీలు ఇవ్వడం, గెలిచాక మరిచిపోవడం పరిపాటిగా మారిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, గద్దలపాడు గ్రామానికి తక్షణమే శాశ్వత రహదారి నిర్మించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story