Srikakulam: కంకర తేలిన రోడ్డు.. కంటిమీద కునుకు లేని ప్రయాణం!
Srikakulam: పాతపట్నం - తెంబూరు మధ్య 13 కిలోమీటర్ల మేర అధ్వానంగా మారిన రహదారి. తారు రోడ్డు తొలగించి రెండు నెలలైనా పనులు ప్రారంభించని వైనం.
Srikakulam: కంకర తేలిన రోడ్డు.. కంటిమీద కునుకు లేని ప్రయాణం!
శ్రీకాకుళం జిల్లా: అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కలగలిస్తే ప్రయాణం ఎంత భయానకంగా మారుతుందో చెప్పడానికి తెంబూరు - పాతపట్నం రహదారే నిదర్శనం. పాతపట్నం, టెక్కలి రెండు నియోజకవర్గాలను కలిపే ఈ రహదారి నిత్యం ప్రయాణీకులు, వాహానాలతో రద్దీగా ఉంటుంది. రెండు నియోజకవర్గాల పరిధిలో సుమారు 70కు పైగా గ్రామాల ప్రజలు 27 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ రహదారి గుండా నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే టెక్కలి నుంచి కొత్తపల్లి కూడలి వరకు రోడ్ సదుపాయం బాగా ఉన్నా, తరువాత రోడ్ అధ్వానంగా ఉంటుంది. తెంబూరు నుంచి పాతపట్నం వరకు సుమారు 13 కిలోమీటర్ల మేర ఉన్న ఈ సింగిల్ లైన్ రహదారిలో ప్రయాణం భయానకంగా ఉంటుంది. రెండు నెలల క్రితం మరమ్మతులు పేరుతో మొదలైన ఈ తతంగం, నేడు వేలాది మంది ప్రయాణికుల పాలిట శాపంగా మారింది.
ఉన్న రోడ్డును పీకేసి, కొత్త రోడ్డు వేయడానికి తాత్సారం చేస్తున్న యంత్రాంగం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రహదారి అభివృద్ధి పనుల కోసం పలు చోట్ల పాడైపోయిన పాత తారు రోడ్డును పూర్తిగా తొలగించి రోడ్ పక్కన వదిలేశారు. ఆ సమయంలో త్వరలోనే కొత్త రోడ్డు పడుతుందని ఆశించిన ప్రజలకు ఇప్పుడు నిరాశే మిగిలింది. రోడ్డుపై తారు వేయకపోవడంతో వాహనాలు వెళ్లేటప్పుడు భారీగా దుమ్ము రేగుతోందని, దీనివల్ల వెనుక వచ్చే వాహనదారులకు దారి కనిపించక ప్రమాదాలకు గురవుతున్నారని వాహన చోధకులు వాపోతున్నారు. తవ్వి వదిలేసిన గుంతలు, పొడుచుకొచ్చిన కంకర, పిక్కరాళ్లతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ గుంతలను గమనించలేక, గుంతల్లో టైర్లు జారీ అదుపుతప్పి పలు ప్రమాదాలకు గురవుతున్నామని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలు, రోగులను ఈ దారిలో ఆసుపత్రికి తరలించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రహదారిలో ద్వారకాపురం జంక్షన్ సమీపంలోని రోడ్డు మధ్యలో ఉన్న కల్వర్టుకు రంధ్రం ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఈ కల్వర్టుకి మరమ్మతులు వెంటనే చేపట్టకపోతే అధిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రోడ్డు మరమ్మతులు ప్రారంభించే ముందు పనికి సరిపడా జనశక్తి, మెటీరియల్స్ సిద్ధంగా ఉంచుకొని పనిని వేగవంతంగా పూర్తి చేయాలి కానీ ఇక్కడ పాత రోడ్డును తొలగించి రెండు నెలలు గడుస్తున్నా కనీసం మెటీరియల్ వేసే దిశగా కూడా అడుగులు పడలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిధుల మంజూరు లేదో? లేక ఇతర సాంకేతిక కారణాలు ఉన్నాయో? కానీ అసలు రోడ్డును ఎందుకు తవ్వాల్సి వచ్చిందన్నది, ఇన్ని రోజులు గడిచినా రోడ్ ఎందుకు వేయడం లేదని ఇక్కడ ప్రజల ప్రశ్న. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నా, ప్రజల ఇబ్బందులు కళ్లముందు కనిపిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరించడం శోచనీయని, ప్రయాణం సుఖమయం కావాల్సిన చోట ప్రయాణం నరకప్రాయంగా మారిందని వారు వాపోతున్నారు.
తెంబూరు-పాతపట్నం మధ్య ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొందని, కొత్త రోడ్డు పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్డు పనులు పూర్తి చేయాలని, అలాగే రోడ్డు వెడల్పు కూడా పెంచాలని పరిసర గ్రామాల ప్రజలు, ప్రయాణికులు కోరుకుంటున్నారు. సదరు అంశంపై ఆర్ అండ్ బి అధికారులను అడుగగా తెంబూరు - పాతపట్నం రహదారిలో తెంబూరు జంక్షన్ నుండి గంగువాడ మొదటి రైల్వే గేటు వరకు సుమారు 6 కిలోమీటర్లు.
సీతారాంపల్లి జంక్షన్ నుండి పాతపట్నం వరకు సుమారు 2 కిలోమీటర్లు మొత్తంగా సుమారు 8 కిలోమీటర్ల మేర రోడ్ కు 2 కోట్ల 23 లక్షలు మంజూరు అయినట్లు, తారు రోడ్డు మరమ్మతులు మరియు నూతన రోడ్డు నిర్మాణానికి పనులు జరుగుతున్నాయన్నాయని, మరో మూడు, నాలుగు వారాల్లోగా ఈ రోడ్ పనులను పూర్తి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. అయితే ఇటీవల పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రాజారాణి రైల్వే హాల్ట్ ను ప్రారంభించేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ గుంతల రహదారి గుండా ప్రయాణించడం కొసమెరుపు.




