Tragedy : గోదావరిలో విషాదం.. ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతు, ముగ్గురి మృతదేహాలు లభ్యం
Tragedy : ఏపీ-తెలంగాణ బోర్డర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఏటపాక మండలం గోదావరి నదిలో మునిగి ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ముగ్గురి మృతదేహాలు లభించగా, ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది.
Tragedy in Godavari
Tragedy : గోదావరి తీరంలో తీరని విషాదం చోటుచేసుకుంది. సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలు నది సుడిగుండంలో కలిసిపోయాయి. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దుల్లోని ఎటపాక మండలం పురుషోత్తపట్నం రేవు వద్ద శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు నదిలో మునిగిపోయారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతున్న ఈ విద్యార్థులు దైవదర్శనం చేసుకుని, పుణ్యస్నానం ఆచరిద్దామని నీటిలోకి దిగి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఒక బృందంగా కలిసి విహారయాత్రకు బయలుదేరారు. భద్రాచలం పరిసరాల్లోని ఆలయాలను దర్శించుకున్న అనంతరం, వారు తమ కారును పురుషోత్తపట్నం రేవు సమీపంలో ఆపారు. నదిలో స్నానం చేయాలని భావించిన ఐదుగురు విద్యార్థులు నీటిలోకి దిగగా, మిగిలిన ఇద్దరు ఒడ్డునే ఉన్నారు. అయితే నదిలో ఉన్న లోతును అంచనా వేయలేక వారు ఒక్కసారిగా సుడిగుండంలో చిక్కుకున్నారు.
ముగ్గురి మృతదేహాలు లభ్యం.. ఇద్దరి కోసం వేట
నీటిలో మునిగిపోతున్న తన స్నేహితులను కాపాడేందుకు దీపక్, హర్ష అనే ఇద్దరు విద్యార్థులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. వారు ఈత రావడంతో ఎలాగోలా ఒడ్డుకు చేరుకోగలిగారు. గల్లంతైన వారిని పి.సతీష్ కుమార్, జి.తేజ, నవదీప్, పి.అభిరామ్, సి.శ్రీకర్‌లుగా గుర్తించారు. స్థానిక జాలర్లు, ఈతగాళ్ల సహాయంతో పోలీసులు గాలింపు చేపట్టగా.. అభిరామ్, శ్రీకర్, నవదీప్‌ల మృతదేహాలు బయటపడ్డాయి. సతీష్ కుమార్, తేజల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
లోతు అంచనా వేయలేకే ఈ ఘోరం
ఈ ఘటనపై పోలవరం డిప్యూటీ డీఎస్పీ ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. విద్యార్థులు నీరు తక్కువగా ఉంటుందని భావించి లోపలికి వెళ్లారని, కానీ నది ప్రవాహం మరియు లోతు గురించి వారికి అవగాహన లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈత రాని వారు లోతులోకి వెళ్లడంతో ప్రాణాలు కాపాడుకునే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి, గాలింపు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది.
కుటుంబాల్లో మిగిలిన తీరని వేదన
మృతులంతా భద్రాచలం, మదనపల్లె ప్రాంతాలకు చెందిన వారు కావడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు అవుతారనుకున్న పిల్లలు ఇలా అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నదులు, కాలువల వద్ద సందర్శకులు అప్రమత్తంగా ఉండాలని, లోతు తెలియకుండా నీటిలోకి దిగవద్దని అధికారులు మరోసారి హెచ్చరిస్తున్నారు.




