TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవాణి టికెట్ల బుకింగ్‌లో కీలక మార్పులు చేసిన టీటీడీ
TTD : శ్రీవాణి ట్రస్ట్ ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్‌లో టీటీడీ కీలక మార్పులు చేసింది. ఇకపై రూ. 10,500 ఒకేసారి చెల్లించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందవచ్చు.
Tirumala
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురు అందించింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం పొందే భక్తులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యకు టీటీడీ చెక్ పెట్టింది. ఆన్‌లైన్ టికెట్ల బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేస్తూ శుక్రవారం నుంచే కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీనివల్ల ఇకపై భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా, సులభంగా దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళం ఇచ్చి వీఐపీ బ్రేక్ దర్శనం పొందాలనుకునే భక్తులు ఇప్పటివరకు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొనేవారు. ముందుగా ట్రస్టుకు రూ.10,000 విరాళం ఇచ్చి, ఆ తర్వాత దర్శనం కోసం మళ్ళీ రూ.500 విరాళం కట్టాల్సి వచ్చేది. అయితే ఈ రెండు పేమెంట్ల మధ్య ఉన్న సమయం లోపే టికెట్లు అయిపోయినట్లు వచ్చేది. దీంతో రూ.10 వేలు కట్టినా దర్శనం దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యపై వెల్లువెత్తిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న టీటీడీ, విరాళం మరియు దర్శనం రుసుమును ఒకేసారి చెల్లించేలా మార్పులు చేసింది.
ఒకే క్లిక్‌తో రూ.10,500 చెల్లింపు
కొత్త విధానం ప్రకారం, భక్తులు ఇకపై విరాళం కోసం రూ.10,000, వీఐపీ బ్రేక్ దర్శనం కోసం రూ.500 వేర్వేరుగా చెల్లించాల్సిన అవసరం లేదు. మొత్తం రూ.10,500 కలిపి ఒకేసారి పేమెంట్ చేయవచ్చు. దీనికోసం టీటీడీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) పేమెంట్ గేట్‌వేను అనుసంధానించింది. దీనివల్ల యూపీఐ (UPI), నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు వేగంగా పూర్తవుతాయి. పేమెంట్ అవ్వగానే టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి భక్తులు ఆందోళన చెందాల్సిన పని లేదు.
బుకింగ్ నిబంధనలు, కోటా
టీటీడీ ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో 800 శ్రీవాణి టికెట్లను విడుదల చేస్తోంది. ఒక ఐడీపై ఒకసారి బుక్ చేసుకుంటే, గరిష్టంగా నలుగురు (1+3) భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకసారి టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి మళ్ళీ వారం రోజుల వరకు అదే ఐడీతో టికెట్ బుక్ చేసుకోవడానికి వీలుండదు. ఈ నిబంధనల వల్ల టికెట్ల బ్లాక్ మార్కెట్ ని అరికట్టడంతో పాటు సామాన్య భక్తులకు కూడా దర్శనం దొరికే అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది.
పేమెంట్ గేట్‌వేలో మార్పులు
యూనియన్ బ్యాంక్ ఇండియా సహకారంతో టీటీడీ తన వెబ్‌సైట్‌లో సాంకేతిక మార్పులు పూర్తి చేసింది. గతంలో పేమెంట్ ఫెయిల్ అవ్వడం లేదా సర్వర్ బిజీగా రావడం వంటి సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆధునిక పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి రావడంతో భక్తులు తమ స్మార్ట్‌ఫోన్ల నుంచే సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణకు మరియు నూతన ఆలయాల నిర్మాణానికి ఉపయోగిస్తున్నట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.




