Bhimavaram: థియేటర్లో భారత్ మాతా కీ జై.. జాతీయ జెండాతో కేంద్రమంత్రి సందడి!

Bhimavaram: భీమవరంలో 'ధురంధర్ 2' చిత్రాన్ని కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులతో కలిసి కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వీక్షించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 28 March 2026 11:37 AM IST
Bhimavaram
X

Bhimavaram: థియేటర్లో భారత్ మాతా కీ జై.. జాతీయ జెండాతో కేంద్రమంత్రి సందడి!

​భీమవరం: ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ఎంతటి శక్తివంతంగా ఉందో ధురంధర్ సినిమా ప్రతిబింబించిందని, యువతలో దేశభక్తిని పెంపొందించే సినిమా అని కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. శుక్రవారం భీమవరం మల్టీప్లెక్స్‌లో 'ధురంధర్ 2' చిత్రాన్ని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ కుటుంబ సభ్యులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన బిజెపి శ్రేణులతో కలిసి వీక్షించారు. సినిమా ప్రదర్శన సమయంలో దేశభక్తిని చాటిచెప్పే సన్నివేశాలు, భారత దేశం కోసం సాహసోపేతమైన పోరాట ఘట్టాలు వచ్చినప్పుడు హాల్ అంతా ఒక్కసారిగా ఉద్వేగంతో నిండిపోయింది. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ స్వయంగా జాతీయ జెండాను పట్టుకుని 'భారత్ మాతా కీ జై' అని నినదించగా, అక్కడున్న వందలాది మంది బిజెపి కార్యకర్తలు, నాయకులు ఆయనతో కలిసి గొంతు కలపడంతో థియేటర్ ప్రాంగణం మారుమోగిపోయింది. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం ఉప్పొంగింది. కేంద్రమంత్రి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఒక సామాన్యుడిలా సినిమా వీక్షించడం అందరినీ ఆకట్టుకుంది. హాల్ అంతా బిజెపి నాయకులు, కార్యకర్తలతో థియేటర్ కిక్కిరిసిపోయి ఒక పండుగ వాతావరణం నెలకొంది.

సినిమా అనంతరం మీడియాతో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ..

ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దులను, జాతీయ భద్రతను కాపాడే భారత వీర జవాన్ల సాహసాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ ఈ సినిమాలో అత్యంత స్ఫూర్తిదాయకంగా ఆవిష్కరించారని, రణవీర్ సింగ్, సంజయ్ దత్, మాధవన్ లాంటి నటులు ప్రాణం పోసినట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం నేడు ఎంతటి శక్తివంతంగా ఉందో ఈ సినిమా ప్రతిబింబించింది అని ఇలాంటి చిత్రాలు యువతలో దేశభక్తిని పెంపొందిస్తాయి అని ఆయన పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్ అధ్యక్షులు గోకరాజు నరసింహరాజు, సీనియర్ నాయకులు నార్ని తాతాజీ, ఈతకోట తాతాజీ, కాయిత సురేంద్ర, వబిలిశెట్టి ప్రసాద్, అడబాల శివ, షేక్ మొహద్దిన్, జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story