Vizag: డెడ్ లైన్ లోగా పనులు పూర్తి చేయాలి.. కలెక్టర్ వార్నింగ్
Vizag: విశాఖపట్నం జిల్లాలో నియోజకవర్గాల అభివృద్ధి పనులపై కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ సమీక్ష.
Vizag: డెడ్ లైన్ లోగా పనులు పూర్తి చేయాలి.. కలెక్టర్ వార్నింగ్
Vizag: విశాఖపట్నం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలు, అభివృద్ధి ప్రతిపాదనలు, తీసుకున్న చర్యలు, పెండింగ్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయం అత్యవసరమని సూచించారు.
పెండింగ్ పనులను నిర్దిష్ట కాలపట్టికలో పూర్తి చేయాలని, ప్రజలకు తక్షణమే ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భీమిలి నియోజకవర్గంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డిపో నిర్మాణం, మధురవాడలో పీహెచ్సీ భవన నిర్మాణం, భీమిలి బీచ్ రోడ్ సుందరీకరణ, రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు. సెజ్ ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించాలన్నారు.
ఆనందపురంలో కొత్త అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలన్నారు. శాటిలైట్ సిటీ పనులు, మధురవాడలో కొత్త సబ్స్టేషన్ నిర్మాణం, మత్స్యకారుల కోసం ల్యాండింగ్ సెంటర్లు, కొత్త కన్వెన్షన్ సెంటర్ నిర్మాణంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల అమలులో వేగం పెంచాలని కలెక్టర్ ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు, ఎస్ఎన్ఎల్ కాలువ పనులు చేయాలన్నారు. గోకుల్ పార్క్ అభివృద్ధి, పాత షాపింగ్ కాంప్లెక్స్ తొలగించి సర్వతి పార్క్ నిర్మాణం, టిడ్కో ఇళ్ల నిర్మాణం,
కేజీహెచ్ అభివృద్ధి పనులు, స్లమ్ పునరావాస కార్యక్రమాల అమలులో నాణ్యతను పాటించాలని సూచించారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాలలో కూడా అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ముందడుగు వేయాలని సూచించారు. పెండింగ్ పనులపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, విధాన పరమైన సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తమ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్కు వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వర నాయుడు, ఇంచార్జ్ ఆర్డిఓ శేష శైలజ, జీవీఎంసీ ఎడిసి సత్యవేణి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


