Kurnool: పట్టా ఉంది కానీ భూమి లేదు.. బ్యాంకు నోటీసులతో రైతుల బెంబేలు!
Kurnool: కర్నూలు జిల్లా తుగ్గలి మాజీ వీఆర్వో నాగేంద్రపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి.
Kurnool: పట్టా ఉంది కానీ భూమి లేదు.. బ్యాంకు నోటీసులతో రైతుల బెంబేలు!
తుగ్గలి (కర్నూలు జిల్లా): ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, అమాయక రైతుల ఆశలను ఆసరాగా చేసుకుని లక్షలాది రూపాయలు వెనకేసుకున్న ఒక వీఆర్వో నిర్వాకం ఇప్పుడు తుగ్గలి మండలంలో సంచలనంగా మారింది. గతంలో ఇక్కడ వీఆర్వోగా పనిచేసిన నాగేంద్ర (ప్రస్తుత రాతన వీఆర్వో) అక్రమాలపై బాధితుడు, రైతు నాయకంటి బెన్నీ గళమెత్తారు.
అక్రమాల పర్వం ఇలా:
రైతు బెన్నీ ఆరోపణల ప్రకారం.. నాగేంద్ర తుగ్గలిలో పనిచేసిన సమయంలో కొండలు, గుట్టలు, వాగులను సైతం వదలకుండా సుమారు 350 మంది రైతులకు డి-పట్టాలు మంజూరు చేశారు. దీనికి ప్రతిగా ఒక్కో రైతు నుండి రూ.30 వేల నుండి లక్ష రూపాయల వరకు వసూలు చేశారని ఏకరువు పెట్టారు.
కీలక ఆరోపణ: తన భార్య మణికుమారి పేరున 2022లో సర్వే నంబర్ 344 బి8 లో పట్టా ఇచ్చారని, అయితే ఇప్పటివరకు ఆ భూమి ఎక్కడుందో చూపించలేదని బెన్నీ వాపోయారు.
బ్యాంకు నోటీసుల భయం: పట్టా పుస్తకాలు ఉన్నాయని నమ్మి బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్న రైతులు, ఇప్పుడు ఆ భూమి ఆన్‌లైన్‌లో కనిపించకపోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. బ్యాంకులు అప్పు కట్టాలని నోటీసులు జారీ చేస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.
వీఆర్వో దురుసు ప్రవర్తన:
భూమి ఎక్కడుందో చూపించాలని వీఆర్వోను ప్రశ్నిస్తే.. "నీ ఇష్టం వచ్చింది చేసుకో, భూమి చూపించే ప్రసక్తే లేదు" అంటూ దురుసుగా సమాధానం ఇస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ నెల 10వ తేదీన సీపీఎం నాయకులతో కలిసి కర్నూలు జాయింట్ కలెక్టర్ నూర్ ఖామర్‌కు వినతి పత్రం అందజేసినట్లు బెన్నీ తెలిపారు.
ఎంఆర్వో రవి స్పందన:
ఈ వ్యవహారంపై స్థానిక ఎంఆర్వో రవి మాట్లాడుతూ.. గతంలో ఏం జరిగిందో తనకు తెలియదని, అయితే బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా విచారణ జరిపి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన అధికారులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామన్నారు.




