Tirumala: భక్తికి ముగ్ధులైన టీటీడీ బోర్డు.. 116 ఏళ్ల వృద్ధురాలికి వీఐపీ దర్శనం!

Tirumala: అలిపిరి నడకమార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది.

Arun Chilukuri
Published on: 6 July 2026 10:42 AM IST
Tirumala
X

Tirumala: భక్తికి ముగ్ధులైన టీటీడీ బోర్డు.. 116 ఏళ్ల వృద్ధురాలికి వీఐపీ దర్శనం!

Tirumala: కలియుగ వైకుంఠం తిరుమల కొండపై ఒక అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. శ్రీవారిపై ఉన్న అపారమైన భక్తితో అలిపిరి నడకమార్గం గుండా కాలినడకన తిరుమలకు చేరుకున్న 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించింది. టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు ప్రత్యేక చొరవ చూపడంతో, అధికారులు వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు స్వామివారి దర్శన ఏర్పాట్లు దగ్గరుండి పూర్తి చేశారు.

శనివారం అలిపిరి నడకమార్గంలో ఈ వయసులోనూ నవనీతమ్మ ఎంతో నిబ్బరంగా నడుచుకుంటూ కొండపైకి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. నెటిజన్లు ఆమె భక్తికి ముగ్ధులయ్యారు. అయితే, మొదట్లో ఆమె వివరాలు సరిగ్గా తెలియకపోవడంతో, కర్ణాటకకు చెందిన వ్యక్తిగా ప్రచారం జరిగింది.

ఈ వైరల్ వీడియోపై టీటీడీ ఛైర్మన్‌ బీఆర్ నాయుడు వెంటనే స్పందించారు. వృద్ధురాలి వివరాలు తెలిస్తే నేరుగా తన కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కోరారు. ఛైర్మన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, ఆ వృద్ధురాలి వివరాలను సేకరించారు. ఆమె తమిళనాడుకు చెందిన నవనీతమ్మగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె తిరుపతిలోని జీవకోనలో ఉన్న తన బంధువుల ఇంట్లో ఉంటున్నట్లు సమాచారం లభించింది.

వివరాలు తెలియగానే ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు నవనీతమ్మ కుటుంబానికి అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. ఆలయంలోకి దగ్గరుండి తీసుకెళ్లి శ్రీవారిని దర్శింపజేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వృద్ధురాలికి పట్టువస్త్రం కప్పి, శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం భక్తితో ఆమె కాలికి నమస్కరించి, ఆశీర్వాదం తీసుకోవడం అక్కడి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. వృద్ధురాలి పట్ల టీటీడీ చూపిన ఈ చొరవపై భక్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story