Kothapeta: కొత్తపేట విద్యార్థుల సత్తా.. 39 మందికి ట్రిపుల్ ఐటీ సీట్లు!

Kothapeta: కొత్తపేట నియోజకవర్గం నుండి 39 మంది ట్రిపుల్ ఐటీలకు ఎంపిక. విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 16 Jun 2026 12:26 PM IST
Kothapeta
X

Kothapeta: కొత్తపేట విద్యార్థుల సత్తా.. 39 మందికి ట్రిపుల్ ఐటీ సీట్లు!

Kothapeta: కొత్తపేట నియోజకవర్గం నుంచి 39 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీలకు ఎంపిక కావటం గర్వకారణం అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే సమావేశాన్ని ఏర్పరిచారు. విద్యార్థులను అభినందించి వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.

100 రోజుల ప్రణాళిక వారి విజయానికి ఏ విధంగా కారణమైందో, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులను గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు మొదలైనవి ఎలా ఉన్నాయని విద్యార్థులను అడిగారు.విద్యార్థులు మాట్లాడుతూ గతంలో కన్నా భోజనం బాగుందని, తమకు ఇచ్చిన విద్యార్థి మిత్ర కిట్లు బాగున్నాయని చెప్పి సంతోషం వ్యక్తం చేశారు.

భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు.తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల కృషితో ప్రస్ఫుటంగా చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయడం అపూర్వమన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ విద్యార్థులు మరింతమంది ఆదర్శవంతంగా ముందుకు వెళ్లాలన్నారు. ట్రిపుల్ ఐటీ లో చదువుకున్నవారందరూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలు పొందుతారని ఆకాంక్ష వ్యక్తం చేశారు. కొత్తపేట మండలం నుంచి 15 మంది, రావులపాలెం మండలం నుంచి 5గురు, ఆత్రేయపురం మండలం నుంచి 11 మంది, ఆలమూరు నుంచి 8 మంది మొత్తం నియోజకవర్గ నుంచి 39 మంది ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారని తెలిపారు.

విద్యార్థులు తమ కృషిని మరింతగా కొనసాగించి భవిష్యత్తులో ఉన్నత ఫలితాలు సాధించాలన్నారు. తాను ఇప్పటికే నాలుగో సారి శాసనసభ్యునిగా పనిచేస్తున్నానని, మొదటిసారి శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు అప్పట్లో పాఠశాలలు, హాస్టళ్ల భవనాలు కూడా సరిగా లేని పరిస్థితి ఉండేదని, 1995లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాఠశాలలు అభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు.

ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టారన్నారు. కౌన్సిలింగ్ విధానంలో మార్పులు తెచ్చారన్నారు. విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారన్నారు. ఆ విధంగా విద్యావ్యవస్థ ముందడుగు వేసిందన్నారు. మరలా ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతల స్వీకరించిన తర్వాత విద్యావ్యవస్థలో అనేక గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.

ఉపాధ్యాయుల నియామకాలతో పాటు, నాణ్యమైన బోధనను అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటూ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100 రోజుల ప్రణాళిక అద్భుతాలు సృష్టించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగుపరచాల్సిన అంశాలపై విద్యార్థులతో చర్చించారు. ఆయా అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా చూస్తానని వారితో అన్నారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA

Next Story