Rajamahendravaram: ఎమ్మెల్సీ సోము వీర్రాజును కలిసిన 5 ఏళ్ల బాల మేధావి!

Rajamahendravaram: రాజమహేంద్రవరంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజును కలిసిన 5 ఏళ్ల బాల మేధావి నిటలాక్షరామ.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari
Published on: 10 Jun 2026 11:46 AM IST
Rajamahendravaram
X

Rajamahendravaram: ఎమ్మెల్సీ సోము వీర్రాజును కలిసిన 5 ఏళ్ల బాల మేధావి!

తూర్పుగోదావరి జిల్లా: రాజమహేంద్రవరం అత్యంత ప్రతిభావంతుడైన బాల మేధావి దాసరోజు నిటలాక్షరామ ఈరోజు తన తల్లిదండ్రులతో కలిసి రాజమహేంద్రవరం విచ్చేసి గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని ఆశీర్వాదాలు పొందారు.

కేవలం ఐదు సంవత్సరాల వయస్సులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న ఈ బాలుడు పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, శ్లోకాలు, సైన్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ సాహిత్యం, ప్రపంచ కవులు వంటి అనేక విభాగాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. అదేవిధంగా శక్తి చక్రాలు, కల్పాలు, మన్వంతరాలు, శరీర నిర్మాణం వంటి అంశాలపై కూడా స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడు. కవిత్వం, కథలు చెప్పడంలోనూ ప్రత్యేక నైపుణ్యం ప్రదర్శిస్తున్నాడు.

సంస్కృతం, స్పానిష్ వంటి భాషలను అభ్యసిస్తున్న ఈ బాలుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఇప్పటివరకు 150 ట్రోఫీలు, 90 మెడల్స్ సాధించి, 25 “బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”లో స్థానం సంపాదించాడు. రెండు చేతులతో సమానంగా వ్రాయగలిగే అరుదైన ప్రతిభ కూడా అతనిలో ఉంది. అంతర్జాతీయ మ్యాగజైన్‌లలో అతని ప్రతిభ ప్రచురితమైంది.

విశాఖపట్నంలోని ఇస్కాన్ సంస్థ ఈ బాలుడికి “తత్వ చైతన్య నిధి” అనే బిరుదును ప్రదానం చేసింది. అలాగే ముంబైకి చెందిన SKRIS మోడల్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. భవిష్యత్తులో ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)లో చేరి దేశానికి అంబాసిడర్‌గా సేవ చేయాలనే లక్ష్యాన్ని ఈ బాలుడు వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా శ్రీ సోము వీర్రాజు గారు బాలుడి ప్రతిభను ప్రశంసిస్తూ, ఇంత చిన్న వయస్సులో ఇంతటి అద్భుతమైన జ్ఞాపకశక్తి, జ్ఞానం కలిగి ఉండటం ఎంతో ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఈ బాలుడు భవిష్యత్తులో దేశానికి గర్వకారణం అవుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు.

తల్లిదండ్రులు డాక్టర్ రసజ్ఞ గారు (న్యూరో ఇమ్యునాలజీ సైంటిస్ట్), డాక్టర్ దాసరోజు శ్రీనివాసరావు గారు (శ్రీ కాత్యాయని పీఠం వ్యవస్థాపకులు, వాస్తు-జ్యోతిష్య పండితులు) తమ కుమారుని ప్రతిభను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ రంగాల్లో మరింత ఉన్నతిని సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశం అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతున్న ఈ కాలంలో ఇలాంటి ప్రతిభావంతులైన బాలలను ప్రోత్సహించడం సమాజం మొత్తం బాధ్యత అని శ్రీ వీర్రాజు గారు తెలిపారు.

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

Padala Chiranjeevi Reddy, Staff Reporter -East Godavari

తూర్పు గోదావరి జిల్లాలో 13 సంవత్సరాల నమ్మకమైన జర్నలిజం ప్రయాణం. నిఖార్సైన వార్తలు, లోతైన విశ్లేషణలతో సాగుతున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.

Next Story