Amalapuram: జనగణన ప్రక్రియను వేగవంతం చేయండి.. కలెక్టర్ ఆర్.మహేష్ ఆదేశం!
Amalapuram: బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ జనగణన ప్రక్రియ వేగవంతం. మే నెలాఖరులోగా వంద శాతం గృహాల గణన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ అధికారులకు ఆదేశాలు.
Amalapuram: జనగణన ప్రక్రియను వేగవంతం చేయండి.. కలెక్టర్ ఆర్.మహేష్ ఆదేశం!
అమలాపురం : డాక్టర్.. బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ జనగణన ప్రక్రియలో అత్యంత కీలకమైన గృహాల గణన హౌస్ లిస్టింగ్ ప్రక్రియను మే నెలాఖరులోగా అత్యంత వేగవంతం చేసి, వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి నుండి ఏపీ జనగణన నోడల్ అధికారి ప్రత్యేక కమిషనర్ ఎస్ఎస్ రావత్ జనగణన డైరెక్టర్ జె నివాస్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల కలెక్టర్లకు జనగణన ప్రక్రియ వేగవంతం చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. జన గణన నుండి ఏ ఒక్కరు మిస్ కాకుండా అందరినీ సమగ్రంగా నమోదు చేయాలని ఆదేశించారు. జనగణన ప్రక్రియ పురోగతిపై మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, మరియు మండల స్థాయి అధికారులు చొరవ చూపి నిర్దేశిత కాలవ్యవధి నాటికి ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.
గడువు లోగా పూర్తి చేయాలని జనగణన అనేది దేశ భవిష్యత్తు ప్రణాళికలకు దిక్సూచి వంటిదన్నారు. ఇందులో ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వరాదని, మే నెలాఖరు నాటికి జిల్లాలోని అన్ని గృహాల నమోదు ప్రక్రియను ముగించాలన్నారు. అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తూ క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు డేటాను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. చార్జ్ అధికారులైన తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రతిరోజూ ఈ ప్రగతిని పర్యవేక్షించాలన్నారు.వేసవి తీవ్రత దృష్ట్యా క్షేత్రస్థాయి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన వసతులు కల్పించాలని, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో గణన ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజలందరూ తమ ఇంటికి వచ్చే జనగణన సిబ్బందికి సరైన సమాచారం అందించి సహకరించాలని కలెక్టర్ కోరారు. తప్పుడు సమా చారం ఇవ్వడం గానీ, వివరాలు దాచడం గానీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
లక్ష్యాలను సకాలంలో చేరుకోని వారిపై, విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ వైఖోమ్ నైదియాదేవి,జిల్లా అర్ధ గణాంక అధికారి, ఎం మురళీకృష్ణ మున్సిపల్ కమిషనర్లు, ఉప తహశీల్దార్లు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.




